MS Dhoni performs dandiya with DJ Bravo: భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఐపీఎల్‌(IPL 2024)కు సిద్ధమ‌వుతున్నాడు. వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేజ్ అంబానీ(Mukesh Ambani) కొడుకు ప్రీ-వెడ్డింగ్ వేడుక‌కు హాజ‌రైన ధోనీ.. అక్కడ  సంద‌డి చేశాడు. భార్య సాక్షి సింగ్‌తో క‌లిసి ప్రత్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన మ‌హీ.. గుజ‌రాతీ సంప్రదాయ నృత్యమైన‌ దాండియా ఆడాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ స‌హ‌చ‌రుడు డ్వేన్ బ్రావోతో క‌లిసి మ‌హీ హుషారుగా దాండియా ఆడాడు. ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.  రామ్ చ‌ర‌ణ్‌తో పాటు బాలీవుడ్ స్టార్లు స‌ల్మాన్ ఖాన్, ర‌ణ్‌వీర్ సింగ్‌ల‌తో మ‌హీ భాయ్ ముచ్చ‌టించాడు.


ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి 
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి కనిపిస్తోంది. ముఖేష్, నీతా అంబానీల రెండవ కుమారుడు అనంత్ అంబానీ ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత వీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక అనంత్ ని వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ జామ్ నగర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు పంచ వ్యాప్తంగా సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, దేశ విదేశాలకు చెందిన ప్రధానులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నేటితో ముగియనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా డాన్సులతో తెగ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్లతో పాటు క్రికెటర్లు కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేంద్ర సింగ్ ధోని కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చారు.






టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి జామ్‌నగర్‌కు వచ్చాడు. అలాగే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ , సూర్యకుమార్‌ యాదవ్‌ అతని భార్య, ఇషాన్‌ కిషన్‌, జహీర్‌ ఖాన్‌ అతని భార్య, డ్వేన్‌ బ్రావో, టిమ్‌ డేవిడ్‌ అతని భార్య, ట్రెంట్‌ బౌల్ట్‌ అతని భార్య, హార్ధిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా ఈ వేడుకలకు హాజరయ్యారు. అలాగే ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ సైతం ఈ వేడకకు విచ్చేశాడు.


ఇక కొత్త జంట విషయానికి వస్తే అనంత్ అంబానీతో రాధిక స్నేహం ఇప్పటిది కాదు. బాల్యం నుంచి కొనసాగుతోంది. అనంత్‌కు అనారోగ్యంతో ఉన్నప్పుడు తోడుగా ఉన్నది రాధికానే అని సన్నిహితులు చెబుతుంటారు. అనంత్‌కు అన్నివిధాలా తోడుగా ఉంటూ.. ధైర్యాన్ని ఇచ్చింది ఆమేనని.. తిరిగి ఆరోగ్యంతో కోలుకోనేందుకు ఎంతో సహకరించిందని అంటారు. అందుకే, అంబానీ కుటుంబానికి ఆమె చాలా స్పెషల్ అంటారు. 


అతిథుల కోసం 2500 రకాల వంటకాలు


గుజరాత్ లో మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసం అంబానీ ఫ్యామిలీ దాదాపు 2500 రకాల వంటకాలను వడ్డించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు హాజరయ్యే అతిరథ మహారధుల కోసం ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 25 మంది చెఫ్ బృందాన్ని జామ్ నగరానికి రప్పించారట. పార్సీ నుంచి థాయ్ వరకు మెక్సిజన్ నుంచి జపనీస్ వరకు అన్ని రకాల వెరైటీలను సిద్ధం చేశారు. అంతేకాదు వచ్చే అతిధులకు ఏదైనా స్పెషల్ వంటకం కావాల్సి వస్తే వెంటనే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.