Ben Stokes Record:  టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడి జాబితాలో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేరాడు. పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటలో అతను తన 107వ సిక్సును కొట్టాడు. దీంతో  న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ రికార్డును సమం చేశాడు. బ్రెండన్ కూడా టెస్టుల్లో 107 సిక్సులు బాదాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుకు మెక్ కల్లమ్ కోచ్ గా వ్యవహరిస్తుండడం విశేషం.


టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో స్టోక్స్ చేరాక... డ్రెస్సింగ్ రూం నుంచి కోచ్ బ్రెండన్ అతడిని చప్పట్లతో అభినందించాడు. మెక్ కల్లమే 176 ఇన్నింగ్సుల్లో 107 సిక్సులు కొడితే.. స్టోక్స్ 160 ఇన్నింగ్సుల్లోనే ఆ మార్కును అందుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్ క్రిస్ట్ మూడో స్థానంలో ఉన్నాడు.


ఇంగ్లండ్- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్సులో ఇంగ్లిష్ జట్టు 281 పరుగులు చేసింది. అనంతరం పాక్ తన తొలి ఇన్నింగ్సులో 202 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 275 పరుగులు చేసింది. దీంతో పాక్ ముందు 354 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం పాక్ రెండో ఇన్నింగ్సులో 3 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.   






అరంగేట్రంలోనే అదరగొట్టిన పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్


పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్. అరంగేట్ర మ్యాచ్ లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ తో రెండో టెస్టుతో ఈ యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన మొదటి మ్యాచ్ లోనే ప్రత్యర్థి జట్టుకు తన బౌలింగ్ పవర్ చూపించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లతో చెలరేగాడు. అంతేకాదు ఇంగ్లండ్ తొలి 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అబ్రార్ ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు ట్విటర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.