Morne Morkel confirmed as India's new bowling coach:  టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్ పంతం నెగ్గించుకున్నాడు. టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్‌ను నియమించాలని పట్టుబట్టిన గౌతీ.. అనుకున్నది సాధించాడు. మోర్ని మోర్కెల్‌ను టీమిండియా మెన్స్‌ క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. గతంలో IPL, సౌతాఫ్రికా 20, లక్నో, డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా మోర్నెల్‌ పనిచేశాడు. పాకిస్తాన్ మెన్స్‌ క్రికెట్‌ జట్టుకు సహాయ సిబ్బందిలోనూ పనిచేశాడు. భారత జట్టు సహాయక సిబ్బంది అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ దోస్చేట్‌లతో మోర్నీ మోర్కెల్‌ చేరనున్నాడు.  టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్‌ నియామకాన్ని బీసీసీఐ కార్యదర్శి ధ్రువీకరించారు. మోర్కెల్‌ పదవీకాలం సెప్టెంబర్ 1న ప్రారంభమవనుంది. గౌతం గంభీర్ నేతృత్వంలో శ్రీలంకతో తొలి సిరీస్‌ ఆడిన టీమిండియా టీ 20 సిరీస్‌ గెలుచుకుని.. వన్డే సిరీస్‌ను కోల్పోయింది. లంక టూర్‌లో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే పని చేశాడు. అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ దోస్చేట్‌ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. 




 

గంభీర్‌తో సత్సంబంధాలు

టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌తో కలిసి గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో ఆటగాడిగా మోర్ని మోర్కెల్‌ ఆడాడు. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. ఆ సమయంలో లక్నో మెంటార్‌గా గంభీర్‌ ఉన్నాడు. వీరిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. మళ్లీ గంభీర్‌తో మోర్కెల్ తిరిగి పని చేయనున్నాడు, 

 

మంచి రికార్డే

దక్షిణాఫ్రికా తరఫున 247 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మోర్కెల్ టెస్టుల్లో 309, వన్డేల్లో 188, టీ20ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. మోర్కెల్... డేల్ స్టెయిన్, వెర్నాన్ ఫిలాండర్‌లు ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా బౌలింగ్‌ విభాగం చాలా పటిష్టంగా ఉండేది. కోచింగ్‌లోకి వచ్చినప్పటి నుంచి మోర్కెల్ గత సంవత్సరం భారత్‌లో జరిగిన ODI ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టుకు కోచ్‌లలో ఒకరిగా సేవలందించాడు. 

 

ముందు అన్నీ సవాళ్లే...

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.  చెన్నైలో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నుంచే మోర్నెల్‌ పదవీ కాలం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కూడా భారత జట్టుకు పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. భారత్‌కు సుదీర్ఘ టెస్ట్ సీజన్ ఉంది. గంభీర్, మోర్కెల్ ఇద్దరూ ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని ఎలా తగ్గిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బుమ్రా, ఈ ఏడాది చివర్లో భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతను జట్టుకు అత్యంత ముఖ్యమైన బౌలర్‌గా ఉంటాడు. బుమ్రాను ఎలా వినియోగించుకుంటారన్న దానిపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.




Also Read: Arshad Nadeem: ఓ గేదె, ఆల్టో కార్ - జావెలిన్ త్రో విజేతకు పాకిస్తాన్‌లో విచిత్రమైన బహుమతులు