Travis Head: భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కి ఐసీసీ షాకిచ్చింది. రెండోటెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ తో వాదనకు దిగడంతోపాటు మ్యాచ్ లో అనుచితంగా ప్రవర్తించిందనుకుగాను జరిమానా విధించిది. సోమవారం క్రమశిక్షణ సంఘం ఎదుట జరిగిన వాదనల అనంతరం ఐసీసీ ప్రవర్తన నియామవళిలోని 2.5 ఆర్టికల్ ని సిరాజ్ అతిక్రమించాడని ఐసీసీ తేల్చింది. అందుకగాను అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. ఈ ఆర్టికల్ ప్రకారం ఫౌల్ ల్యాంగేజీ, చేష్టలు, సంజ్నలతో దురుసుగా ప్రవర్తించి, ప్రత్యర్థిని రెచ్చగొట్టడం తప్పుగా నిర్దారిస్తుంది. మరోవైపు ఇదే టెస్టులో హెడ్ కూడా ప్రవర్తన నియామవళిని అతిక్రమించినట్లు ఐసీసీ తేల్చింది. అతను ఆర్టికల్ 2.13ని బ్రేక్ చేసినట్లు వెల్లడించింది. 


బతికిపోయిన హెడ్..
మరోవైపు రెండోటెస్టుకు సంబంధించి క్లిప్పింగ్ లో సిరాజ్ తో హెడ్ వాదనకు దిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా కూడా ఆర్టికల్ 2.5ని హెడ్ కు వర్తించడంలో ఐసీసీ శీతకన్ను వేసింది. దీంతో అతనికి కేవలం ఒక డీమెరింట్ పాయింట్ మాత్రమే శిక్ష విధించింది. గత రెండు సంవత్సరాల్లో ఇది మొదటి తప్పుగా భావించిన ఐసీసీ ఈ శిక్షతో సరిపెట్టింది. మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లే ఎదుట ఇరువురు ప్లేయర్లు తమ తప్పును అంగీకరించడంతో ఐసీసీ శిక్షను ఖరారు చేసింది.  మరోవైపు ఇరువురు ఒకరకమైన తప్పు చేసినప్పటికీ, సిరాజ్ ఎక్కువ శిక్ష వేసి, హెడ్ ను మందలించి వదిలేయడం సరికాదని పలువురు భారత ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. 


ఇరువురి వాదన ఎలా ఉందంటే..
జరిగిన సంఘటనపై హెడ్, సిరాజ్ ఎవరికీ వారు తాము చేసిన పనులను సమర్థించుకున్నారు. నిజానికి జరిగిన వివాదంపై మ్యాచ్ అనంతరం హెడ్ విచారం వ్యక్తం చేశాడు. బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ ను అభినందిస్తే దానికి బదులుగా అతను పరుషంగా స్పందించినట్లు పేర్కొన్నాడు. ఏదేమైనా ఇలా జరుగుతుందని తను అనుకోలేదని, ఇకపై ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటానని వెల్లడించాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో హెడ్ చెప్పిన విషయాలపై సిరాజ్ విబేధించాడు. తనను బాగా బౌలింగ్ చేసినట్లు ప్రశంసించలేదని, హెడ్ అబద్ధం చెబుతున్నాడని వెల్లడించాడు.


నిజానికి ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ గమనించినట్లయితే హెడ్ తనతో కావాలనే వాదనకు దిగాడని, దానికి తాను ధీటుగా స్పందించినట్లు పేర్కొన్నాడు. మంచి బంతికి సిక్సర్ కొడితే ఏ బౌలర్ కైనా నిరాశ అనిపిస్తుందని, అదే మంచి బాల్ కి వికెట్ పడితే సంబరాలు చేసుకోవడం కామన్ అని, తను చేసిన పనిని సిరాజ్ సమర్థించుకున్నాడు. మరోవైపు ఈ వివాదం రెండో టెస్టు మూడో రోజే ముగిసి పోయింది. మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన సిరాజ్ వద్దకు వెళ్లి, హెడ్ ఏదో మాట్లాడాడు. దానికి సానుకూలంగా సిరాజ్ కూడా ఆన్సరిచ్చాడు. అలాగే మ్యాచ్ ముగిశాక ఇద్దరూ ఆలింగనం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం ముగిసినట్లేనని అభిమానులు ఆనంద పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఐసీసీ జోక్యంతో ఈ వివాదం ముగిసిపోయిందని పేర్కొంటున్నారు.