ICC Taking Action Against Travis Head Vs Mohammed Siraj: అడిలైడ్ టెస్టులో మాటల యుద్ధానికి దిగిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కన్నెర్ర చేసినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ సంఘం ముందు విచారణ జరిగిన తర్వాత వీరికి శిక్ష విధించే అవకాశముందని తెలుస్తోంది. అయితే సస్పెన్షన్ లాంటి భారీ శిక్షలు కాకుండా మ్యాచ్ ఫీజులో కోత, డీ మెరిట్ పాయింట్ల కేటాయింపు వంటి జరిమానాలు విధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ లో 140 పరుగులతో హెడ్ రాణించిన సంగతి తెలిసిందే. అయితే చూడచక్కని యార్కర్ తో హెడ్ ను ఔట్ చేశాక సిరాజ్ -హెడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిపై ఎవరి వాదనలు వారు చేస్తున్నారు. 






హెడ్ ఏమన్నాడంటే..
నిజానికి జరిగిన వివాదంపై మ్యాచ్ అనంతరం హెడ్ విచారం వ్యక్తం చేశాడు. బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ ను అభినందిస్తే దానికి బదులుగా అతను పరుషంగా స్పందించినట్లు పేర్కొన్నాడు. ఏదేమైనా ఇలా జరుగుతుందని తను అనుకోలేదని, ఇకపై ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటానని వెల్లడించాడు. 


Also Read: కోహ్లీ, రోహిత్ సత్తా చాటాల్సిందే - గత కాలపు ఘనతలతో ప్రస్తుతం చోటు ఆశించలేరు, మాజీల వార్నింగ్


సిరాజ్ వాదన ఏమింటంటే..?
అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో హెడ్ చెప్పిన విషయాలపై సిరాజ్ విబేధించాడు. తనను బాగా బౌలింగ్ చేసినట్లు ప్రశంసించలేదని, హెడ్ అబద్ధం చెబుతున్నాడని వెల్లడించాడు. నిజానికి ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ గమనించినట్లయితే హెడ్ తనతో కావాలనే వాదనకు దిగాడని, దానికి తాను ధీటుగా స్పందించినట్లు పేర్కొన్నాడు. మంచి బంతికి సిక్సర్ కొడితే ఏ బౌలర్ కైనా నిరాశ అనిపిస్తుందని, అదే మంచి బాల్ కి వికెట్ పడితే సంబరాలు చేసుకోవడం కామన్ అని, తను చేసిన పనిని సిరాజ్ సమర్థించుకున్నాడు. మరోవైపు ఈ వివాదం రెండో టెస్టు మూడో రోజే ముగిసి పోయింది. మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన సిరాజ్ వద్దకు వెళ్లి, హెడ్ ఏదో మాట్లాడాడు. దానికి సానుకూలంగా సిరాజ్ కూడా ఆన్సరిచ్చాడు. అలాగే మ్యాచ్ ముగిశాక ఇద్దరూ ఆలింగనం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం ముగిసినట్లేనని అభిమానులు ఆనంద పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన క్లిప్పింగ్స్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 


సిరాజ్ కు జరిమానా విధించాలి..
మరోవైపు సండెట్లో సడేమియాలాగా ఈ వివాదంలోకి దూరిపోయాడు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. సిరాజ్ కు జరిమానా విధించాలని ఐసీసీకి ఉచిత సలహా ఇస్తున్నాడు ఈ మాజీ క్రికెటర్. నిజానికి తను మాట్లాడుతున్నది హెడ్ తో వివాదం గురించి కాదని, ఫీల్డులో సిరాజ్ ప్రవర్తనే అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించాడు. బీజీటీలో ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ ఎల్బీగా అంపైర్ ఔటివ్వక ముందే సంబరాలు చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వికెట్ల ముందు దొరికిపోయాక, అసలు అంపైర్ కి అప్పీల్ చేయకుండానే సంబరాలు చేసుకోవడం సరికాదని తెలిపాడు. తను క్రికెట్ ఆడుతున్నప్పుడు సహచరుడు పేసర్ బ్రెట్ లీ ఇలా చేసినప్పుడు ఐసీసీ చాలాసార్లు అతడిని జరిమానాతో శిక్షించిందని గుర్తు చేశాడు. ఇప్పుడు సిరాజ్ విషయంలోనూ అలా చేయాలని వ్యాఖ్యానించాడు. 


Also Read: అభిమానులను నెట్ సెషన్లకు రాకుండా నిషేధించడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక కామెంట్స్