Ind Vs Aus Test Series: పింక్ బాల్ టెస్టులో భారత్ ఓడిపోయాక అందరి వేళ్లు మళ్లీ సీనియర్ల వైపే వెళ్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా అనుభవజ్ణులైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేలవ రీతిలో అడిలైడ్ టెస్టులో ఔట్ కావడం అభిమానులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. రెండో టెస్టులోనే కాదు.. గత కొంతకాలంగా తరచూ విఫలమవుతూ, ఈ ఇద్దరూ బ్యాటర్లు విమర్శలకు గురవుతున్నారు. అయితే పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నా మళ్లీ రెండో టెస్టులో ఆఫ్ స్టంప్ బలహీనతకు అధిగమించలేకపోయాడు. ఇక రోహిత్ కూడా టెస్టు క్రికెట్‌లో తనదైన మార్కును చూపెట్టడంలో విఫలమవుతున్నాడు. 


రోహిత్ తీసికట్టు ఆటతీరు..


2024 - 25 టెస్టు సీజన్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరు తీసికట్టుగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన ఈ సీజన్లో ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్ ఆడిన హిట్ మ్యాన్.. 11.83 సగటుతో 142 పరుగులు మాత్రమే సాధించాడు. అందులో ఒక్క ఫిఫ్టీ (52) మాత్రమే ఉంది. అది కూడా బంగ్లాదేశ్‌పై చేసింది కావడం విశేషం. అయితే ఈ ఇయర్ మొత్తానికి తీసుకుంటే కాస్త పర్వాలేదన్నట్లుగా ఉంది. 12 టెస్టుల్లో 23 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. 27.13 సగటుతో 597 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలో ఉన్నాయి. అత్యధిక స్కోరు 131 పరుగులు కావడం విశేషం. రోహిత్ స్టేచర్‌కి ఈ గణాంకాలు ఏ మాత్రం సరికావని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 


కోహ్లీ కూడా అంతంతమాత్రం.. 


ఇక ఈ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లో 315 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. 26.25 సగటు నమోదు చేశాడు. పెర్త్ టెస్టులో అజేయ సెంచరీతో రాణించడంతో ఆ మాత్రం సగటు నమోదైంది. మిగతా ఇన్నింగ్స్‌లో కోహ్లీ స్థాయికి తగ్గ ఆట తీరు ప్రదర్శించ లేకపోయాడు. ఇక 2020 నుంచి కోహ్లీ ప్రదర్శన పడిపోతూనే ఉంది. 36 టెస్టుల్లో 64 ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లీ.. 32.14 సగటుతో 1961 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, తొమ్మిది అర్థ సెంచరీలు ఉన్నాయి. 186 అత్యధిక స్కోరు కావడం విశేషం. నిజానికి పరిమిత ఓవర్ల క్రికెట్లో యాభైకి పైగా సగటు ఉన్న కోహ్లీ.. టెస్టుల్లో మాత్రమే ఇటీవల విఫలం కావడంతో సగటు 48కి చేరింది. 


రోహిత్ మళ్లీ ఓపెనింగ్ చేయాలి..


రోహిత్ మళ్లీ ఓపెనింగ్ చేస్తేనే కుదురుకుంటాడని మాజీ ప్లేయర్ అతుల్ వాసన్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలోని పిచ్‌లు రోహిత్ ఆటతీరుకు సరిపోతాయని, అతను ఓపెనర్‌గా దిగితేనే రాణించే అవకాశముందని వివరించాడు. ఇక కోహ్లీ కూడా తన ఆఫ్ స్టంప్ బౌలింగ్ బలహీనతను అధిగమించాలని సూచించాడు. మొత్తానికి ఇప్పటికే 35+ వయస్సులో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారని, గతంలో ఉన్నట్లుగా వాళ్ల ఆటతీరు ఇప్పుడు ప్రదర్శించడం సవాలుతో కూడుకున్నదని, పరిస్థితులకు తగినట్టుగా ఆటతీరు మార్చుకుంటేనే ఈ ఇద్దరు ప్లేయర్లు సఫలమయ్యే అవకాశముందని వ్యాఖ్యానించాడు. మరోవైపు గతంలో కూడా కోహ్లీ, రోహిత్‌లు ఫామ్ కోల్పోయి తంటాలు పడినా, మళ్లీ పుంజుకున్నారని, ఆసీస్‌తో సిరీస్‌లో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు. వీళ్లిద్దరూ సత్తా చాటితే జట్టులోని యువ క్రికెటర్లకు కూడా బూస్టప్ లభిస్తుందని, తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్ షిఫ్ ఫైనల్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. 


Also Read: U19 Asia Cup Final: భారత్‌కు షాకిచ్చిన బంగ్లా టైగర్లు - అండర్ -19 అసియా కప్ కైవసం