Mohammed Siraj: టీమిండియా పేసర్, హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఆసియా కప్‌కు ముందు ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో తొమ్మిదో స్థానంలో ఉన్న మియా (సిరాజ్ ముద్దుపేరు) ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. ఆసియా కప్ ఫైనల్స్ లో శ్రీలంకపై ఆరు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
వన్డేలలో ఏడాదిన్నర కాలంగా నిలకడగా రాణిస్తున్న సిరాజ్.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంక, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లు ముగిశాక నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడు వెస్టిండీస్ సిరీస్‌లో ఆడలేదు. మిగతా బౌలర్లు కూడా నిలకడగా రాణించడంతో సిరాజ్.. ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోయాడు. ఆసియా కప్ మొదలునాటికి కూడా అతడు 9వ స్థానంతోనే ఉన్నాడు. కానీ ఈ టోర్నీలో తొలుత ఆకట్టుకోలేకపోయినా ఫైనల్‌లో శ్రీలంకపై మాత్రం చెలరేగిపోయాడు.
ఆసియా కప్ ఫైనల్‌లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు ఒక మెయిడిన్ వేసి 21 పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడి వన్డే ర్యాంకింగ్ అమాంతం పెరిగింది. తాజా ప్రదర్శనతో సిరాజ్.. 694 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. నిన్నటిదాకా నెంబర్ వన్ హోదాను అనుభవించిన జోష్ హెజిల్‌వుడ్ (678 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయాడు. ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్,మిచెల్ స్టార్క్ , మాథ్యూ హెన్రీ, ఆడమ్ జంపా వరుసగా 8 స్థానాలను ఆక్రమించగా కుల్దీప్ యాదవ్ 9, షహీన్ అఫ్రిది 10వ స్థానాలనలో ఉన్నాడు.
భారత్ ఆధిపత్యం..
ఐసీసీ తాజా ర్యాంకులలో భారత్ మూడు ఫార్మాట్లలో జట్టుగానే కాకుండా వ్యక్తిగతంగా ఆటగాళ్ల ర్యాంకులతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. జట్టు, వ్యక్తిగత ర్యాంకులలో టాప్ - 3లో వివరాలు..
- టెస్టులలో నెంబర్ వన్ జట్టు
- టీ20లలో నెంబర్ వన్ జట్టు
- వన్డేలలో రెండో స్థానం
- టీ20లలో నెంబర్ వన్ బ్యాటర్ : సూర్యకుమార్ యాదవ్
- వన్డేలలో నెంబర్ వన్ బౌలర్ : మహ్మద్ సిరాజ్
- టెస్టులలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ : రవీంద్ర జడేజా
- టెస్టులలో నెంబర్ వన్ బౌలర్ : అశ్విన్
- టెస్టులలో నెంబర్ టూ ఆల్ రౌండర్ : జడేజా
- టెస్టులలో నెంబర్ త్రీ బౌలర్ : జడేజా
- వన్డేలలో నెంబర్ 2 బ్యాటర్ : శుభ్‌మన్ గిల్
- టీ20లలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ : హార్ధిక్ పాండ్యా
అంతేగాక వన్డే వరల్డ్ కప్ ప్రారంభమయ్యేనాటికి ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్న భారత్ ఈ సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసినా ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడిస్తే టీమిండియా 50 ఓవర్ల ఫార్మట్‌లో కూడా నెంబర్ వన్ టీమ్ అవనుంది.