Mohammed Shami Slams Hardik Pandya: ఐపీఎల్(IPL)లో ముంబై ఇండియన్స్(MI)కు తొలి మ్యాచ్‌లోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఐపీఎల్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించాలనుకున్న ముంబై ఆశలపై గుజరాత్ టైటాన్స్(GT) నీళ్లు చల్లింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గుజారాయ్ అద్భుత విజయం సాధించి ఐపీఎల్ 17వ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఈమ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకోగా... బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్యానికి 6 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. రోహిత్ శర్మ, బ్రెవీస్ రాణించినా ముంబైకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో గుజరాత్ బౌలర్లు అద్భుత బౌలింగ్ తో...ముంబై బాటర్లను కట్టడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా వ్యూహాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం కెప్టెన్సీ అంటూ మాజీలు హార్దిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా స్టార్ బౌలర్ షమీ కూడా హార్దిక్ కెప్టెన్సీపై పెదవి విరిచాడు.
షమీ ఏమన్నాడంటే..?
మహ్మద్ షమీ(Mohammed Shami ) హార్దిక్ పాండ్య( Hardik Pandya) కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ మూడు, నాలుగు స్థానాల్లో కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడాన్ని షమీ తప్పుబట్టాడు. ధోనీలా ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదని షమీ హార్దిక్‌పై విమర్శలు చేశాడు. ధోనీ ఎప్పటికీ ధోనీనే అని. అతనికి ఎవరూ సరితూగరని కూడా షమీ తెలిపాడు. ధోనీ అయినా కోహ్లీ అయినా అందరి ఆలోచనా ధోరణి ఒకేలా ఉండదని... నైపుణ్యాన్ని బట్టి ఆటలో కొనసాగాలని షమీ సూచించాడు. గుజరాత్ తరఫున హార్దిక్ పాండ్య మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడని....చాలాసార్లు ఐదో స్థానంలో కూడా ఆడాడని కానీ ముంబై తరఫున ఏడో స్థానంలో ఎందుకు వచ్చాడని షమీ ప్రశ్నించాడు. హార్దిక్ దాదాపు టెయిలెండర్‌లాగా కనిపిస్తున్నాడని.... ఏడో స్థానంలో వస్తే మీపై మీరే ఒత్తిడి పెంచుకున్నట్లవుతుందన్నాడు. ఒకవేళ పాండ్య ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ ఇంతవరకు వచ్చి ఉండేది కాదని షమి వ్యాఖ్యానించాడు.
తొలి ఓవర్ ఎందుకు..?
తొలి మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ముంబై ఓడిపోవడాన్ని ముంబై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో పరాజయానికి హార్దిక్ కెప్టెన్సీ కూడా ఓ కారణమని మాజీలు విమర్శిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, బ్రెవిస్, తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా ముంబైకి విజయం మాత్రం దక్కలేదు. హార్దిక్ పాండ్యా బౌలర్లను వినియోగించుకున్న తీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఇర్ఫాన్ పఠాన్, కెవిన్ పీటర్సన్ అసహనం వ్యక్తం చేశారు. బుమ్రా బదులు పాండ్య తొలి ఓవర్ వేయడం సరైంది కాదని మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ చేస్తూ ఈ ముగ్గురు వ్యాఖ్యానించారు. తొలి ఓవర్‌ను బుమ్రా కాకుండా కెప్టెన్ హార్దిక్ వేశాడు. అతడు సంధించిన 8 బంతుల్లోనే గుజరాత్ ఓపెనర్లు 19 పరుగులు రాబట్టారు. తొలి ఓవర్‌ను బుమ్రా వేయకపోవడంపై ఇర్ఫాన్ పఠాన్ బుమ్రా ఎక్కడ అంటూ పోస్టు పెట్టడంతో వైరల్‌గా మారింది. పాండ్య బ్యాటింగ్ ఆర్డర్‌పైనా పఠాన్ విమర్శలు గుప్పించాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌ను తప్పించుకోవడానికి టిమ్ డేవిడ్‌ను ముందు పంపించాడనే అర్థంలో వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్ వేసిన బుమ్రా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. వృద్ధిమాన్ సాహాను క్లీన్‌బౌల్డ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో బుమ్రా కేవలం 14 రన్స్‌కే 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు మొదట బౌలింగ్ ప్రారంభించిన పాండ్య మాత్రం వికెట్ లేకుండానే 3 ఓవర్లలో 30 పరుగులు సమర్పించాడు. హార్దిక్ ప్రణాళికలపై విమర్శలు రేగాయి. ఇటువైపు లక్ష్య ఛేదనలోనూ నాలుగు బంతుల్లోనే 11 రన్స్ చేసిన హార్దిక్.. కీలక సమయంలో ఔట్ కావడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.