Wasim Akram on Pakistan Cricket team: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో దాయాదుల సమరం అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన దశ నుంచి ఓడిపోయిన పాక్‌పై ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 120 పరుగులను కూడా ఛేదించలేరా అంటూ మండిపడుతున్నారు. ఇప్పుడు పాక్‌ అభిమానులకు తోడు మాజీ క్రికెటర్లు కూడా బాబర్‌ సేనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మీ ఆట ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పాక్‌ దిగ్గజ ఆటగాడు పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు.  బాబర్ అజామ్‌( Babar Azam) కెప్టెన్సీ పేలవంగా ఉందన్నాడు. మహ్మద్ రిజ్వాన్‌(Mohammad Rizwan)కు ఏ పరిస్థితిలో ఏమి చేయాలో అర్థం కావడం లేదని కూడా చెప్పాడు.
 

ఆక్రమ్‌ ఏమన్నాడంటే..?

పాక్ జట్టులోని చాలా మంది ఆటగాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరని వసీం అక్రమ్(Wasim Akram) వెల్లడించాడు. అలాంటి ఆటగాళ్లను జట్టులోంచి విసిరి పారేసి ఇంట్లో కూర్చోపెట్టాలని సూచించాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ అని, మీరు మీ దేశం కోసం ఆడుతున్నారని.. అలాంటప్పడు ఇలాంటి చర్యలు తగదని కూడా అక్రమ్‌ మండిపడ్డాడు. ప్రస్తుతం పాక్‌ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ 10 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నారని.. వారికి కొత్తగా తానేమీ నేర్పలేనని ఆక్రమ్‌ తెలిపాడు. మహ్మద్ రిజ్వాన్‌కు ఏ పరిస్థితిలో ఏం చేయాలో తెలీదని... రిజ్వాన్‌కు అసలు జ్ఞానం లేదని మండిపడ్డాడు. బుమ్రా బౌలింగ్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆడాలని... అయినా రిజ్వాన్ షాట్ ఆడటానికి వెళ్లి అవుట్ అయ్యాడని వసీం మండిపడ్డాడు. అసలు బాబర్‌ ఆజమ్‌ కెప్టెన్సీ కూడా తనకు పెద్దగా నచ్చలేదని ఆక్రమ్‌ అన్నాడు. 

 

ఇదేం బ్యాటింగ్‌

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పాక్‌ బ్యాటర్‌ ఇమాద్ వసీం ఉద్దేశపూర్వకంగా బంతులను వృథా చేశాడని పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ ఆరోపించాడు.  120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సిన పాకిస్థాన్ బ్యాటర్లు 59 డాట్ బాల్స్ ఆడారని తెలిపాడు. ఇమాద్‌ వసీం 23 బంతులు ఆడి కేవలం 15 పరుగులే చేశాడని పాక్ ఓటమికి ఇది కూడా ఓ కారణమని సలీం మాలిక్‌ తెలిపాడు. వసిమ్ ఇన్నింగ్స్‌ చూస్తే పరుగులు సాధించకుండా బంతులను వృధా చేశాడని... లక్ష్య ఛేదనలో ఇది సరికాదని మాలిక్ తెలిపాడు. పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి బాగాలేదని... కెప్టెన్ బాబర్ ఆజంతో కొంతమంది ఆటగాళ్లకు సమస్యలు ఉన్నాయని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తెలిపాడు. బాబర్ అజామ్ నేతృత్వంలోని జట్టు సూపర్ ఎయిట్ దశకు చేరుకోవడానికి అర్హత లేదని  మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ అన్నాడు. పాకిస్థాన్‌కు ఆత్మవిశ్వాసం లేదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు.

 

అవకాశాలు సంక్లిష్టం

టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ జట్టు కష్టాలు మరింత పెరిగాయి. సూపర్ ఓవర్ వరకు జరిగిన మ్యాచ్‌లో తొలుత అమెరికా చేతిలో ఓడిన పాక్ జట్టు ఇప్పుడు భారత్ చేతిలో ఓడిపోయింది. పాకిస్థాన్ జట్టు తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచినా.. సూపర్-8కి వెళ్లాలంటే మిగతా మ్యాచ్‌ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.