Moeen Ali announces international retirement : అంతర్జాతీయ క్రికెట్(International cricket)లో మరో ఆల్‌రౌండర్ ప్రస్థానం ముగిసింది. ఇంగ్లండ్(England)కు సుదీర్ఘకాలం సేవలందించిన స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ(Moeen Ali) తన క్రికెట్ కెరీర్‌ను ముగించాడు. బ్రిటీష్ జట్టులో స్టార్ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన అలీ... పదేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భవిష్యత్తు తరాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మొయిన్ అలీ వెల్లడించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో మొయిన్ అలీ చివరి మ్యాచ్ ఆడాడు.
పదేళ్ల కెరీర్..
2014 వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. పదేళ్ల కెరీర్‌లో బ్రిటీష్ జట్టు తరపున 68 టెస్టులు, 138 వన్డేలు ఆడాడు. 92 టీ 20లు కూడా ఆడాడు. లార్డ్స్‌లో శ్రీలంకతో జరిగిన టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. మూడు ఫార్మట్లలో కలిపి ఎనిమిది సెంచరీలు, 28 అర్ధ సెంచరీలతో 6678 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరపున 366 వికెట్లు సాధించాడు.
బాధేం లేదు..
తన 10 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించిన మొయిన్ అలీ.. ఈ ప్రకటన తనకేమీ బాధ లేదన్నాడు. ఇప్పటికే బ్రిటీష్ జట్టు తరపున చాలా క్రికెట్ ఆడేశానన్న అలీ... ఇక నవ తరం జట్టులోకి రావాల్సిన టైం వచ్చేసిందన్నాడు. తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా.. తనకేమీ బాధగా లేదన్నాడు. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అని... రిటైర్‌మెంట్‌కు ఇదే సరైన సమయమని మొయిన్ అలీ తెలిపాడు. " ప్రస్తుతం నా వయస్సు 37 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. ఇప్పటికే నేను దేశం కోసం చాలా క్రికెట్ ఆడాను. రిటైర్‌మెంట్‌కు ఇదే సరైన సమయం" అని అలీ ప్రకటించాడు. "నాకు చాలా గర్వంగా ఉంది. ఇంగ్లండ్ జట్టుకు ఇన్ని మ్యాచులు ఆడతానని నేను అనుకోలేదు. నేను 300 మ్యాచులు ఆడాను. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం కొనసాగిస్తా. కోచింగ్ వైపు కూడా వెళ్లే అవకాశం ఉంది. నేను అత్యుత్తమంగా ఉండాలనుకుంటున్నాను.” అని అలీ అన్నాడు. మొయిన్ అలీ CPL 2024లో డిఫెండింగ్ ఛాంపియన్స్, గయానా అమెజాన్ వారియర్స్, చెన్నై సూపర్ కింగ్ర్, జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టలో సభ్యుడిగా ఉన్నాడు.