Mitchell Starc IPL 2024: ఐపీఎల్(IPL) చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్(Mitchell Starc) నిలిచాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ స్టార్క్ కోసం పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి మిచెల్ స్టార్క్ కోసం రూ.24.75 కోట్లు వెచ్చించి వేలంలో స్టార్ పేసర్‌ను కళ్లు చెదిరే ధరకు కేకేఆర్ (Kolkata Knight Riders) సొంతం చేసుకుంది. అయితే ఈ వేలం మాత్రం ఎంతో మంది భారత ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది.


ఇతర దేశాల ఆటగాళ్లకు ఈ స్థాయిలో ధర పలకడం పట్ల టీమిండియా ఫ్యాన్స్, టీమిండియా మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో ఫ్రాంఛైజీ ఆటగాళ్ల కోసం రూ.100 కోట్ల పర్సు ఉంటుంది. అందులో దాదాపు 25 శాతం ఒక్క ప్లేయర్ కోసమే వెచ్చించడం ఎంత వరకు కరెక్టని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇక్కడే మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. మిచెల్ స్టార్క్‌ గత ఏడు సీజన్‌లలో ఐపీఎల్‌ల్లో అసలు ఆడనే లేదు. ఎందుకు ఆడలేదనే విషయంపైనా స్టార్క్‌... వేలం ముగిసిన తర్వాత తొలిసారిగా  స్పందించాడు. 


మిచెల్ స్టార్క్ చివరిసారిగా IPL 2015లో కనిపించాడు. తర్వాత ఏడేళ్లు ఐపీఎల్‌లో స్టార్క్‌ కనిపించలేదు. 7 ఏళ్లుగా ఐపీఎల్ ఆడకపోవడంపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. ఐపీఎల్‌ ఆడకపోవడం తన నిర్ణయమని... ఏడేళ్లు ఈ లీగ్‌ ఆడకుండా ఉన్నందుకు ఇప్పుడు తానేమీ చింతించడం లేదని స్టార్క్‌ అన్నాడు. ఐపీఎల్‌ ఆడకపోవడం తన టెస్టు కెరీర్‌ను మెరుగుపరిచిందని భావిస్తున్నానని కూడా కామెంట్‌ చేశాడు.  ఏది ఏమైనా తన నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని.. వేలంలో జట్లు తనపై మక్కువ చూపిన తీరుకు ఆనందంగా ఉందని.. అందుకు కృతజ్ఞతలనీ అన్నాడు. రాబోయే సీజన్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. మిచెల్ స్టార్క్ IPL 2015 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు తరపున బరిలోకి దిగాడు.  అయితే దీని తర్వాత మళ్లీ 7 సీజన్లు ఆడలేదు. ఐపీఎల్ వేలం 2018లో మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) మినీ వేలం(Auction 2024) ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా(Australia) ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్(Pat Cummins) రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్(Harshal Patel) నిలిచాడు. పంజాబ్ కింగ్స్(Punjab Kings) అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ(UP) తరఫున ఆడిన సమీర్ రిజ్వీ (Sameer Rizvi)అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్(Uncapped Player). సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.