భారత్‌లో ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉందో.. ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్‌కు అంతే క్రేజ్‌ ఉంటుంది. ప్రస్తుతం 13వ బిగ్‌బాష్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లోని మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. మెల్‌బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్ చివర్లో టపటపా వికెట్లు కోల్పోయింది. మెల్‌బోర్న్ స్టార్స్ బౌలర్‌ డేనియల్‌ సామ్స్‌ వేసిన చివరి ఓవర్‌లో వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే తనకు బ్యాటింగ్ రాదనుకుని భావించిన హారిస్ రౌఫ్ ప్యాడ్లు కట్టుకోలేదు. కానీ మూడు బంతులకు మూడు వికెట్లు కోల్పోవడంతో అతడి అంచనాలు తలకిందులయ్యాయి. టపాటపా వికెట్లు పడటంతో చివరి బంతికి తాను మైదానంలోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో సమయం వృథా కాకుడదనే ఉద్దేశంతో 19.5 ఓవర్ల వద్ద అతడు ప్యాడ్లు కట్టుకోకుండానే బ్యాటింగ్‌కు వచ్చేశాడు. ఈ ఘటనతో పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ మరోసారి వార్తలలో నిలిచాడు. 


హరీస్‌ రౌఫ్‌ కాళ్లకు ప్యాడ్స్‌, తలకు హెల్మెట్‌, చేతులకు గ్లవ్స్‌ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్‌ అందుకు అంగీకరించలేదు. బ్యాటర్‌కు కనీస రక్షణ అవసరమని అభ్యంతరం వ్యక్తం చేయడంతో హరీస్‌ ఎట్టకేలకు గ్లవ్స్‌, హెల్మెట్‌ తెచ్చుకుని ఆదరాబాదరాగా నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో నిలబడ్డాడు. అంపైర్ల బలవంతం మీద తలకు హెల్మెట్‌ పెట్టుకున్నా గ్లవ్స్‌ మాత్రం ధరించలేదు. కాళ్లకు ప్యాడ్స్‌ లేకుండా నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న హరీస్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఇంత టాలెంటెడ్‌లా ఉన్నావేంట్రా అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. 


మరోవైపు బిగ్‌బాష్ లీగ్‌  13వ సీజన్‌లో సరికొత్త సాంకేతికతతో స్టంప్స్‌ను నిర్వాహకులు సిద్ధం చేశారు. రంగురంగుల స్టంప్స్‌ను మ్యాచ్‌ల కోసం సిద్ధం చేశారు. రంగులొలికే ఎలెక్ట్రా స్టంప్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల జరిగిన మహిళల బిగ్ బాష్‌ లీగ్‌లో ఈ సాంకేతికతను తొలిసారిగా ఉపయోగించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రయికర్స్ మధ్య జరిగిన మ్యాచుకు ముందుకు ఈ స్టంప్స్ ఎలా పనిచేస్తాయనే దానిపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్, ఆసీస్‌ మాజీ ఆటగాడు మార్క్‌వా వీటి గురించి వివరించారు.  


మ్యాచ్‌లో చోటు చేసుకునే వివిధ సందర్భాలను బట్టి స్టంప్స్‌ ప్రతిస్పందిస్తాయి. బ్యాటర్‌ ఎవరైనా ఔటైతే స్టంప్స్‌ ఎర్రరంగులోకి మారిపోతాయి. బౌండరీలు వచ్చినప్పుడు రంగులు మారుతూ ఉంటాయి. అభిమానులతోపాటు స్టంప్స్‌ కూడా సంబరాలు చేసుకునేలా వీటిని రూపొందించారు. ఒక వేళ నోబాల్‌ పడితే ఎరుపు, తెలుపు రంగులు స్క్రోల్ అవుతాయి. ఓవర్ల మధ్య వ్యవధిలో పర్పుల్‌, బ్లూ కలర్స్‌ వస్తాయి. ప్రేక్షకులను మరింత ఉత్సాహపరించేందుకు నిర్వహకులు ఈ తరహా సాంకేతికతను లీగ్‌లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి ఈ లైట్లు ప్రారంభ దశలోనే ఉన్నా.. రాబోయే కాలంలో వీటినే విరివిగా ఉపయోగించే అవకాశం ఉంది.