సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ ఆటల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే క్రికెట్‌లో సాంకేతికత అత్యంత ప్రాధాన్యాంశంగా మారిపోయింది. డీఆర్‌ఎస్‌, రనౌట్ ఇలా చాలా అంశాల్లో సాంకేతికత అత్యవసరంగా మారింది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో కొత్త రూల్స్, టెక్నాలజీ మైదానంలోకి వచ్చేస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌   13వ సీజన్‌లో సరికొత్త సాంకేతికతతో స్టంప్స్‌ను నిర్వాహకులు సిద్ధం చేశారు. రంగురంగుల స్టంప్స్‌ను మ్యాచ్‌ల కోసం సిద్ధం చేశారు. రంగులొలికే ఎలెక్ట్రా స్టంప్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల జరిగిన మహిళల బిగ్ బాష్‌ లీగ్‌లో ఈ సాంకేతికతను తొలిసారిగా ఉపయోగించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రయికర్స్ మధ్య జరిగిన మ్యాచుకు ముందుకు ఈ స్టంప్స్ ఎలా పనిచేస్తాయనే దానిపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్, ఆసీస్‌ మాజీ ఆటగాడు మార్క్‌వా వీటి గురించి వివరించారు.
  

 

మ్యాచ్‌లో చోటు చేసుకునే వివిధ సందర్భాలను బట్టి స్టంప్స్‌ ప్రతిస్పందిస్తాయి. బ్యాటర్‌ ఎవరైనా ఔటైతే స్టంప్స్‌ ఎర్రరంగులోకి మారిపోతాయి. బౌండరీలు వచ్చినప్పుడు రంగులు మారుతూ ఉంటాయి. అభిమానులతోపాటు స్టంప్స్‌ కూడా సంబరాలు చేసుకునేలా వీటిని రూపొందించారు. ఒక వేళ నోబాల్‌ పడితే ఎరుపు, తెలుపు రంగులు స్క్రోల్ అవుతాయి. ఓవర్ల మధ్య వ్యవధిలో పర్పుల్‌, బ్లూ కలర్స్‌ వస్తాయి. ప్రేక్షకులను మరింత ఉత్సాహపరించేందుకు నిర్వహకులు ఈ తరహా సాంకేతికతను లీగ్‌లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి ఈ లైట్లు ప్రారంభ దశలోనే ఉన్నా.. రాబోయే కాలంలో వీటినే విరివిగా ఉపయోగించే అవకాశం ఉంది. 

 

మరోవైపు ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను రూ. 230 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ వేలంలో ఐపీఎల్ చరిత్రలో ఎన్నో పాత రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇద్దరు ఆటగాళ్లు రూ.20 కోట్లకు పైగా ధర పలికారు. ఈ మినీ వేలం (IPL Auction 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా రూ. 24.75 కోట్లతో మిచెల్ స్టార్క్‌ (Mitchell Starc)ను కొనుగోలు చేసింది. కెప్టెన్ పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. 

 

ఐపీఎల్‌ 17వ సీజన్‌ కోసం బీసీసీఐ మరో కొత్త నిబంధన తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీని మరింత పెంచేలా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పటికే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఈ రూల్‌ను పరీక్షించారు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లోనూ దీన్ని అమలు చేసేందుకు బీసీసీఐ ఇప్పటికే ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఒక ఓవర్లో బౌలర్లు రెండు బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఇస్తారు. బౌలర్లకు అనుకూలంగా ఉండే ఈ రూల్‌తో హిట్టర్ల బాదుడుకు అడ్డుకట్ట వేసినట్లేనని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఐసీసీ వన్డే, టెస్టుల్లో ఓవర్‌కు రెండు బౌన్సర్లను అనుమతిస్తుండగా.. టీ20 ఫార్మాట్‌లో ఒక బౌన్సర్‌కే అనుమతి ఉంది.  ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసేలా బౌలర్లకు అవకాశం ఇవ్వనున్నారన్న వార్తలపై టీమ్‌ఇండియా పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ స్పందించాడు. ఓవర్‌కు రెండు బౌన్సర్లు వేసే అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయమన్నాడు.