ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌పై సంచలన ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్‌కు షాక్‌ తగిలింది. పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కామెంట్రీ లిస్టు నుంచి జాన్సన్‌ను తప్పించారు. వార్నర్‌పై వ్యాఖ్యలతోనే జాన్సన్‌ను కామెంట్రీ లిస్ట్‌ నుంచి తప్పించారని తెలుస్తోంది. పెద్దగా ఫామ్‌లో లేకున్న వార్నర్‌ను పాక్ సిరీస్‌కు ఎంపిక చేశార‌ని, ఎందుకంటే అత‌ను ఈ సిరీస్ త‌ర్వాత రిటైర్ కానున్నట్లు జాన్సన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ కూడా ఆట‌గాళ్లతో స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, సెలెక్షన్ విధానంగా స‌రిగా లేద‌ని కూడా జాన్సన్ ఆరోపించాడు. పాక్ సిరీస్‌కు ట్రిపుల్ ఎం కామెంట‌రీ బృందంలో ఉండ‌నున్నట్లు తొలుత జాన్సన్ చెప్పాడు. కానీ కామెంటేట‌ర్ల బృందం లిస్టులో అత‌ని పేరును చేర్చలేదు. అక్రమ్, టేల‌ర్, హ్యూగ్స్ మాత్రమే కామెంట‌రీ లిస్టులో ఉన్నారు.


డేవిడ్‌ వార్నర్‌పై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వార్నర్‌ ఏమైనా హీరోనా అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఘనంగా వీడ్కోలు పలకడానికి వార్నర్‌ అర్హుడు కాదని జాన్సన్‌ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై పాకిస్థాన్‌‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు డేవిడ్ వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు. పెర్త్ వేదికగా తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా ఎంపిక చేసిన 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో వార్నర్‌పై మిచెల్‌ జాన్సన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీలో చివరి టెస్టు ఆడాలని ఉందని వార్నర్‌ బహిరంగంగా చెప్పడంపై కూడా మిచెల్‌ జాన్సన్‌ విమర్శలు గుప్పించాడు. 2018లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా బాల్‌ టాంపరింగ్‌ చేస్తూ దొరికిపోయిన వార్నర్‌కు ఎందుకు ఘనంగా వీడ్కోలు పలకాలని ఆసిస్‌ మాజీ పేసర్‌ ప్రశ్నించాడు.


ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వీడ్కోలు సిరీస్‌ కోసం అంతా సిద్ధమవుతోందని.. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో దయచేసి ఎవరైనా చెప్పగలరా అని జాన్సన్‌ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఓ ఓపెనర్‌ తానే స్వయంగా రిటైర్మెంట్‌ తేదీ ప్రకటించుకునే అవకాశం ఇవ్వడం ఏమిటని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డును ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంలో కేంద్ర బిందువైన ఓ ఆటగాడికి హీరో తరహా వీడ్కోలు ఎందుకంటూ నిలదీశాడు. బాల్‌టాంపరింగ్‌ వివాదంలో వార్నర్‌తో పాటు ఇతర ఆటగాళ్లూ ఉన్నారని గుర్తు చేశాడు. స్థానిక వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో జాన్సన్‌ ఈ వ్యాఖ్యుల చేశాడు. ఈ విమర్శలపై వార్నర్‌ ఇంతవరకూ స్పందించలేదు.


డేవిడ్‌ వార్నర్‌ టెస్టులకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. సుదీర్ఘ ఫార్మాట్లో చివరగా పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు వార్నర్‌ సిద్ధమయ్యాడు. ఈ నెల 14న పెర్త్‌లో ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం ప్రకటించిన 14 మంది ఆటగాళ్ల జట్టులో వార్నర్‌కు చోటు దక్కింది. ఈ నెల 26న మెల్‌బోర్న్‌లో ఆరంభమయ్యే రెండో టెస్టులోనూ వార్నర్‌ ఆడితే.. వచ్చే నెల 3 నుంచి జరిగే సిడ్నీ మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశముంది. సొంతగడ్డ అయిన సిడ్నీలో టెస్టులకు వీడ్కోలు పలకాలనే ఆశను గతంలో వార్నర్‌ వ్యక్తపరిచాడు.