Michael Vaughan Comments: ఈ ఏడాది నుంచి శ్రేయస్ ఎంత ఫామ్ లో ఉన్నడానేది అందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అనుకోకుండా తుదిజట్టులో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శ్రేయస్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఆ సిరీస్ తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని భారత్ నెగ్గడంలో తను కీలకపాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు. అయితే అలాంటి ఆటగాడిని భారత టీ20 జట్టులో ఎందుకు ఆడించడం లేదని ఇంగ్లాండ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశ్నించాడు. తను సూపర్ ఫామ్ లో ఉన్నాడని, తన ఆటతీరు టీ20లకు అతికినట్లుగా సరిపోతుందని తాజా ఐపీఎల్ ఇన్నింగ్స్ చూస్తే తెలుస్తోందని వ్యాఖ్యానించాడు. అయితే ఇండియా సెలెక్టర్లు తనని ఎందుకని పొట్టి ఫార్మాట్లో ఆడించడం లేదో తెలియడం లేదని వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్లో స్టన్నింగ్ ఫిఫ్టీ.. తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో శ్రేయస్ దుమ్ము రేపాడు. తన సెంచరీ కోసం చూసుకోకుండా, చివర్లో బ్యాటింగ్ శశాంక్ సింగ్ కు ఇవ్వడం అందరి మనసులను దోచింది. ఈ ఇన్నింగ్స్ గరించి వాన్ మాట్లాడాడు. మెగాటోర్నీలోని ఫామ్ నే ఐపీఎల్లోనూ కొనసాగించాడని కితాబిచ్చాడు. ముఖ్యంగా స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొంటూ భారీ సిక్సర్లను బాదాడని, మైదానం నలువైపులా తను షాట్లు ఆడాడని పేర్కొన్నాడు. ఇక 2023లో జరిగిన వన్డే ప్రపంచప్ లో సత్తా చాటిన శ్రేయస్.. ఒక్క ఫైనల్లో మాత్రమే విఫలమయ్యాడని గుర్తు చేశాడు. మరోవైపు 2023లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయాక దేశవాళీల్లో తన సత్తా చాటాడు. పరుగుల వరద పారించడంతో తిరిగి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. నిజానికి గత నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో అతనికి తుది జట్టులో చోటు లేదు. అయితే గాయం కారణంగా చివరి నిమిషంలో మ్యాచ్ నుంచి కోహ్లీ తప్పుకోవడంతో శ్రేయస్ ను జట్టులోకి ఎంపిక చేశారు. అప్పటి నుంచి తను జట్టులో రెగ్యులర్ సభ్యునిగా మారిపోయాడు.
ప్రపంచకప్ లో ఆడించాలని సూచన.. వచ్చే టీ20 ప్రపంచకప్ భారత్, శ్రీలంకలో జరుగుతుందని, అలాగే వన్డే ప్రపంచకప్ కూడా సౌతాఫ్రికాలో నిర్వహిస్తారని వాన్ తెలిపాడు. అక్కడ పిచ్ లు ఇప్పుడు నెమ్మదిగా మారాయని, ఈ పిచ్ లలో శ్రేయస్ అద్భుతంగా ఆడగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటికైన టీ20 ప్రపంచకప్ ప్రణా|ళికల్లో శ్రేయస్ లాంటి అనుభవం గల ప్లేయర్ ని చేరిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. మూడు ఫార్మాట్లలో కేవలం వన్డేల్లో మాత్రమే శ్రేయస్ రెగ్యులర్ గా ఆడుతున్నాడు.