మలేషియా(Malaysia)  వేదికగా జూనియర్‌ పురుషుల అండర్‌ 21 హాకీ ప్రపంచకప్‌(FIH Hockey Men's Junior World Cup 2023) తొలి మ్యాచ్‌లో యువ భారత్‌(Bharat) శుభారంభం చేసింది. మూడోసారి విశ్వవిజేతగా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. బలమైన కొరియాపై 4-2తో విజయం సాధించింది. అర్జీత్‌ సింగ్‌ హుందాల్‌(Araijeet Singh Hundal) హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టడంతో పూల్‌-సి మ్యాచ్‌లో 4-2తో కొరియా(South Korea)ను ఓడించింది.


ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా ప్రత్యర్థి జట్టు పుంజుకునేందుకు అవకాశమే ఇవ్వలేదు. 11వ నిమిషంలో అర్జీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో క్వార్టర్‌లో భారత్‌ ఖాతాలో మరో రెండు గోల్స్‌ పడ్డాయి. 16వ నిమిషంలో అర్జీత్‌ సింగ్‌, 30వ నిమిషంలో అమన్‌దీప్‌ గోల్స్‌ చేయడంతో భారత్‌ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లి విజయాన్ని ఖరారు చేసుకుంది. కానీ మూడో క్వార్టర్‌లో కొరియా కాస్త పుంజుకుంది. 38వ నిమిషంలో లిమ్‌ చేసిన గోల్‌తో కొరియా ఖాతా తెరిచింది. కానీ వెంటనే అర్జిత్‌ సింగ్‌ 41వ నిమిషంలో హ్యాట్రిక్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 4-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. కొరియా ఆటగాడు మింక్‌వాన్‌ 45వ నిమిషంలో గోల్‌ చేసినా ఆ తర్వాత భారత్‌ మరో అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్‌ గురువారం స్పెయిన్‌తో తలపడనుంది. వరల్డ్‌ కప్‌ తొలి మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యామని కెప్టెన్‌ ఉత్తమ్‌ తెలిపాడు. ఈసారి ప్రపంచకప్‌ దక్కించుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించాడు. ఫార్వర్డ్‌ ఉత్తమ్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు గురువారం జరిగే రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌ను, ఈనెల 9న కెనడాను ఎదుర్కోనుంది.



 మరోవైపు న్యూజిలాండ్‌పై భారత మహిళల విజయం: జూనియర్‌ మహిళల ప్రపంచకప్‌లో నామమాత్రమైన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున రూప్ని కుమారి , జ్యోతి ఛెత్రి, సునేలితా తొప్పో గోల్స్‌ కొట్టారు. న్యూజిలాండ్‌ తరఫున ఇసాబెలా స్టోరీ, మదెలిన్‌ హారిస్‌, రైనా ఫో తలో గోల్‌ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో భారత్‌ 3-2తో పైచేయి సాధించింది. 
 44 ఏళ్ల చరిత్ర కలిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత జట్టు రెండుసార్లు విజేతగా నిలిచింది. 2001, 2016లో భారత్ ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచింది. 1997లో రన్నరప్‌గా నిలిచింది. రెండేండ్ల కిందట భువనేశ్వర్‌‌లో జరిగిన గత ఎడిషన్ లో నాలుగో ప్లేస్‌‌తో సరిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పోడియంపైకి రావాలని కోరుకుంటోంది. కొరియాతో పాటు కెనడా, స్పెయిన్‌‌తో కూడిన సులువైన పూల్‌‌–సిలో బరిలోకి దిగుతోంది. గురువారం స్పెయిన్‌‌తో, శనివారం కెనడాతో తలపడనుంది.



భారత జట్టు: ఉత్తమ్‌ సింగ్‌ (కెప్టెన్‌), అరైజిత్‌ సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), ఆదిత్య, సౌరభ్, సుదీప్, బాబీ సింగ్, మోహిత్, రణ్‌విజయ్, శార్దానంద్, అమన్‌దీప్‌ లాక్రా, రోహిత్, సునీల్, అమీర్‌ అలీ, విష్ణుకాంత్, పూవణ్ణ, రాజిందర్‌ సింగ్, అమన్‌దీప్, ఆదిత్య సింగ్‌.