Manav Suthar Ten Wicket Match Haul Vs SL: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దేశానికి ఇది ల్యాండ్‌మార్క్ 600వ టెస్ట్ మ్యాచ్ కాగా, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు 165 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్ రేసులో అత్యంత కీలకమైన ఈ పోరులో యంగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు పడగొట్టి విజయకేతనం ఎగురవేశాడు. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక,  బుధవారం ఐదో రోజు పోస్ట్ లంచ్ సెషన్‌లో 77.4 ఓవర్లలో 206 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ సెంచ‌రీ హీరో సోనాల్ దినుష (84) మ‌రోసారి టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు.  రెండో టెస్టు కొలంబోలో ఈనెల 23 నుంచి జ‌రుగుతుంది. 

Continues below advertisement

Continues below advertisement

మానవ్ సుతార్ 6 వికెట్ల విధ్వంసం.. జడేజా సపోర్ట్రెండో ఇన్నింగ్స్‌లో 24 ఏళ్ల మానవ్ సుతార్ అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో లంక వెన్నువిరిచాడు. కేవలం 55 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి తన తొలి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తీసిన 4 వికెట్లతో కలిపి మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2/16 తో అద్భుత సహకారం అందించగా, పేసర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు. దినేష్ చండిమాల్ కంకషన్ కారణంగా వైదొలగడం, అతడి స్థానంలో వచ్చిన పసిందు సూరియబండార గోల్డెన్ డకౌట్ అవ్వడం లంకను కోలుకోలేని దెబ్బతీసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా, సొనాల్ దినుష కాసేపు పోరాడినా భారత స్పిన్ దాడిని తట్టుకోలేకపోయారు.

పడిక్కల్ తొలి సెంచరీ క్లాస్.. ఇండియా 462 రన్స్ భారీ స్కోరుఅంత‌కుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా, సాయి సుదర్శన్ స్థానంలో నంబర్ 3 లో వచ్చిన దేవదత్ పడిక్కల్ క్లాసిక్ సెంచరీ (167) తో తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో సొనాల్ దినుష సెంచరీ, నిరోషన్ డిక్వెల్లా (80) పోరాటంతో 284 రన్స్ చేయగా, ఇండియాకు 178 పరుగుల భారీ లీడ్ లభించింది.

పంత్ 100 సిక్సర్ల రికార్డు.. 372 రన్స్ టార్గెట్ సెట్రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 193 పరుగులకు ఆలౌట్ అయింది. రిషభ్ పంత్ కేవలం 53 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో వేగంగా 100 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. పడిక్కల్ 44, రాహుల్ 35 రన్స్ చేసి సహకరించారు. గాలేలో అత్యధిక విజయవంతమైన ఛేజ్ 344 మాత్రమే కాగా, 372 రన్స్ ఛేజింగ్‌లో లంక ఏ దశలోనూ విజయం వైపు సాగలేకపోయింది. చారిత్రక 600వ టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గిల్ సేన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కీలకమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది.