MS Dhoni Birthday: ఒకప్పుడు టీమిండియాకు ఆడే క్రికెటర్లు కాస్త బొద్దుగా ఫిట్నెస్ మీద పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అందుకే 90, 2000వ దశకంలో భారత ఫీల్డింగ్ కూడా దారుణంగా ఉండేది. కానీ మహేంద్ర సింగ్ ధోని వచ్చాక టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపడ్డాయి. క్రికెటర్లు కూడా ఆటతో పాటు ఫిట్నెస్ మీద దృష్టి సారించారు. అప్పుడప్పుడే  కొత్తగా ఎంట్రీ ఇచ్చిన  కోహ్లీ, రైనా, జడేజా ధోనిని ఆదర్శంగా తీసుకుని  ఫిట్నెస్ కు అధిక ప్రాధాన్యమిచ్చారు. అయితే నాలుగు పదుల వయసులోనూ ధోని ఇప్పటికీ ఫిట్ గా ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ - 16 లో  20 ఓవర్ల పాటు  వికెట్ కీపింగ్ చేశాడు. మరి 42 ఏండ్ల వయసులో మహీ ఇంత ఫిట్ గా ఎలా ఉన్నాడు..? అసలు ధోని ఏం తింటాడు..? 


పాలు ప్రధానం.. ఇంటి వంటే ఇష్టం.. 


ధోని జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో వైజాగ్ వన్డేలో సుడిగాలి ఇన్నింగ్స్ (183 పరుగులు) ఆడిన తర్వాత కామెంటేటర్ రవిశాస్త్రి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా  ధోని.. ‘నేను రోజూ 5 లీటర్ల పాలు తాగుతా’ అంటూ సమాధానమిచ్చాడు.  అవును.. ధోనికి  పాలు, పాలతో తయారుచేసే పదార్థాలంటే చాలా ఇష్టం. కానీ  ధోని వాటిని మితంగా తింటాడు. ధోని లైఫ్ స్టైల్, ఫిట్నెస్  అందరూ పాటించాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. 


ధోని డైట్ లో పాలు  ప్రధానంగా ఉంటాయి. విటమిన్ డీ3తో పాటు  పుష్కలంగా ప్రొటీన్స్ లభ్యమయ్యే పాలను ధోని అధికంగా తీసుకుంటాడు. వీటి ద్వారా అధికంగా పోషకాలు అందుతాయని ధోని నమ్ముతాడు. ధోని డే స్టార్ట్ అయ్యేది  గ్లాస్ మిల్క్ తాగడంతోనే అని అతడి ఫిట్నెస్ ట్రైనర్లు  చెప్పేమాట.. పాలు అధికంగా తాగే ధోని  సాఫ్ట్ డ్రింక్స్ జోలికి వెళ్లడు.  వాటి స్థానంలో అధికంగా పండ్లు, కూరగాయాల రసాలు తాగుతాడు. ప్రొటీన్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకుంటాడు.  ప్యాక్డ్ జ్యూస్ మాత్రం ముట్టుకోడు. అవి అధిక షుగర్ తో ఉంటాయి కావున వాటికి కూడా మహేంద్రుడు దూరమే..   జంక్ ఫుడ్ కు దూరంగా  ఇంటి ఆహారాన్ని అతిగా ఇష్టపడతాడు.  లంచ్ టైమ్ లో ఎక్కువగా చపాతీ, పప్పు లేదా చికెన్ తోనే కానిచ్చేస్తాడు.  ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ శరీరానికి సమంగా అందేలా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటెన్ చేస్తాడు.  


 






ధోని డైట్ ప్లాన్ ఇదే..


బ్రేక్ ఫాస్ట్ : పండ్లు, కార్న్ ఫ్లేక్స్, గ్లాస్ పాలు,  వీట్ బ్రెడ్, పరోట 
లంచ్ :  చపాతీ (పప్పు లేదా చికెన్), ఒక బౌల్ మిక్స్డ్ వెజిటెబుల్ సలాడ్, కొన్నిసార్లు చపాతి బదులు అన్నం 
డిన్నర్ : డిన్నర్ లో  ఎక్కువ శాతం చపాతీలే.. ఒక బౌల్ పండ్లు లేదా వెజ్ సలాడ్ 
స్నాక్స్ : వ్యాయామానికి ముందు, తర్వాత తాజా ఫ్రూట్ జ్యూస్. సాయంత్రం స్నాక్స్ గా  చీజ్ లేకుండా సాండ్విచ్  లేదా  ఏదైనా ఒక పండు. 


వర్కవుట్.. 


ధోని రోజుకు 4 గంటల పాటు వర్కవుట్స్ చేసేవాడు. కొద్దికాలంగా  వయసు పెరిగి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ఇది కాస్త తగ్గింది. కానీ ఐపీఎల్ ఉంటే మాత్రం  వర్కవుట్స్ పై ఎక్కువగా  దృష్టి పెడతాడు. జిమ్ లో గంటలు గంటలు గడపడం కంటే కూడా ధోని ఎక్కువగా బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఆడతాడు.   బ్యాడ్మింటన్ ద్వారా కళ్లు, ఫుట్బాల్ ద్వారా కాళ్లు  ఎక్కువగా పనిచేస్తాయని  ధోని నమ్ముతాడు. ఒక వికెట్ కీపర్ బ్యాటర్ కు ఏకాగ్రతతో పాటు వేగం కూడా అవసరం. ఈ రెండూ లక్షణాలు  బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఆట ద్వారా గ్రహించవచ్చని ధోని నమ్ముతాడు. 


 






జిమ్, బయట చేసే వర్కవుట్ల ద్వారా బాడీ స్ట్రెంత్ ను పెంచుకోవడానికే ధోని ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు.  ఒక క్రీడాకారుడికి ఆటతో పాటు  ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యం. ఆ దిశగా ధోని కూడా జిమ్ లో ఎక్కువగా  డంబెల్స్, బెంచ్ మీద చేసే రివర్స్ లంజ్, డంబెల్ ఛెస్ట్ ప్రెస్, సింగిల్ లెగ్ డెడ్లిఫ్ట్, పుల్ అప్స్ వంటి వ్యాయామాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. 









Join Us on Telegram: https://t.me/abpdesamofficial