IND vs AUS Test Series: రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి, ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులో వికెట్ కీపర్‌గా ఎవరిని తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతూనే ఉంది. ఇప్పుడు బీసీసీఐ నుంచి దానికి సమాధానం వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉండాలని టెస్టు జట్టు బ్యాకప్ వికెట్ కీపర్, తెలుగబ్బాయి కేఎస్ భరత్‌ని బీసీసీఐ కోరింది. అదే సమయంలో, BCCI కూడా కేఎస్ భరత్‌కు బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను మొదటిసారిగా టెస్ట్ జట్టులో చేర్చుకుంటుంది.


ప్రమాదం జరిగిన తర్వాత పంత్ సమీప భవిష్యత్తులో మైదానంలోకి రావడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో కేఎస్ భరత్ ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌లో రిషబ్ పంత్ బాధ్యతను నిర్వహించడం కచ్చితం అనిపిస్తుంది. భారత్ టెస్టు జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా భరత్ చాలా కాలం నుంచి ఉన్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు. వృద్ధిమాన్ సాహా తర్వాత భారత్ టెస్టు జట్టులో రెండో వికెట్ కీపర్‌గా ఉన్నాడు. భారత్-ఎ తరఫున కూడా భరత్ చాలా మ్యాచ్‌లు ఆడాడు.


అద్భుతమైన ఫామ్‌లో ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ ఈరోజుల్లో అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అతను 2022 చివరిలో బంగ్లాదేశ్‌తో ఆడిన వన్డే సిరీస్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని సాధించాడు. ఫాస్టెస్ట్ డబుల్ చేసిన రికార్డు పంత్‌కు కూడా ఉంది. రంజీ ట్రోఫీలోనూ ఇషాన్ రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు రంజీల్లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 180 పరుగులు చేశాడు.


కేఎస్ భరత్ కూడా
విశేషమేమిటంటే కేఎస్ భరత్ ఇప్పటివరకు 84 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 132 ఇన్నింగ్స్‌లలో 37.46 సగటుతో 4,533 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను తొమ్మిది సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 308 పరుగులుగా ఉంది. ఇది కాకుండా అతను 64 లిస్ట్-ఎ మ్యాచ్‌లు కూడా ఆడాడు. అలాగే 33.62 సగటుతో 1950 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్ భరత్ రాణిస్తే పూర్తి స్థాయి వికెట్ కీపర్ బ్యాటర్‌గా మారే అవకాశం ఉంటుంది.