Kapil Dev on Pant Accident:  టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను దిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళుతుండగా మార్గమధ్యంలో తను నడుపుతున్న కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను డెహ్రాడూన్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్ ఫెక్షన్స్ రాకుండా పంత్ ను ఐసీయూ నుంచి ప్రైవేట్ రూంకు మార్చారు. 


ఒంటరిగా ఎప్పుడూ డ్రైవ్ చేయవద్దు


పంత్ కు జరిగిన యాక్సిడెంట్ పై భారత మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ స్పందించారు. తనను ప్రాణాలతో బయటపడేసినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలని కపిల్ అన్నారు. అలాగే డ్రైవర్ ను పెట్టుకోవాలని, ఒంటరిగా ఎప్పుడూ డ్రైవ్ చేయవద్దని సూచించారు. 'మీకు డ్రైవర్ ను పెట్టుకునే స్థోమత ఉంది. హైస్పీడ్ తో దూసుకెళ్లే అద్భుతమైన కార్లు మీ దగ్గర ఉన్నాయి. అయినా ఒంటరిగా డ్రైవ్ చేయకూడదు. నాకు తెలుసు ఈ వయసులో ఇలాంటివి కొందరికి అలవాటుగా ఉంటాయి. డ్రైవింగ్ చేయాలనే అభిరుచి ఉంటుంది. అయితే బాధ్యతలను కూడా గుర్తుచేసుకుంటూ ఉండాలి. మన గురించి మనమే జాగ్రత్తలు తీసుకోవాలి' అని కపిల్ దేవ్ సూచించారు. 


నన్ను బైక్ ముట్టుకోనివ్వలేదు


అలాగే ఒకప్పుడు తనకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి కపిల్ గుర్తుచేసుకున్నారు. 'నేను క్రికెటర్ గా ఎదుగుతున్న రోజుల్లో మోటార్ సైకిల్ ప్రమాదానికి గురయ్యాను. ఆ తర్వాత మా అన్నయ్య నన్ను కనీసం బైక్ ను ముట్టుకోనివ్వలేదు.' అని కపిల్ తెలిపారు. 


కారు ప్రమాదంలో రిషభ్ పంత్ నుదురు, వీపు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా ఇంకా చిన్న చిన్న గాయాలు కొన్ని ఉన్నాయి. నిన్న పంత్ ముఖానికి చిన్న ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు.  ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడిని ప్రైవేటు గదికి తరలించారు. ఇన్ఫెక్షన్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకే ఇలా చేశారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గాయాల నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు డెహ్రాడూన్‌లోనే చికిత్స పొందుతున్నాడు. మోకాలిలో లిగమెంట్ల చికిత్స కోసం అతడిని విదేశాలకు పంపించడంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. అతడు త్వరగా కోలుకొనేందుకు ప్రైవసీ కల్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.మరోవైపు ఈ ప్రమాదంతో పంత్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, ఐపీఎల్ 2023కు దూరమయ్యాడు.