IND vs SL:  బంగ్లాదేశ్ తో సిరీస్ అనంతరం చిన్న విరామం తర్వాత టీమిండియా, శ్రీలంకతో పొట్టి క్రికెట్ కు సిద్ధమైంది. రేపు వాంఖడే వేదికగా ఆసియా కప్ విజేతలతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్. రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి వారు లేకుండానే భారత్ ఈ సిరీస్ లో బరిలో దిగనుంది. పూర్తిగా కుర్రాళ్లతో నిండిన జట్టును ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య నడిపించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 


సీనియర్ల గైర్హాజరీలో టీమిండియా, శ్రీలంకతో టీ20 సిరీస్ కు సిద్ధమైంది. పూర్తిగా కుర్రాళ్లతో జట్టు నిండి ఉంది. కొందరు ఆటగాళ్లు ఈ సిరీస్ తో టీ20 అరంగేట్రం చేయనున్నారు. రేపు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో తుది జట్టును ఎన్నుకోవడం కోచ్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యలకు కఠినంగా మారనుంది. మ్యాచ్ ఆడే 11 మందిని ఎలా ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 


బ్యాటింగ్ ఆర్డర్ ఇదే!


ఒక ఓపెనర్ గా ఇషాన్ కిషన్ బరిలో దిగడం ఖాయమే. ఇటీవలే ముగిసిన బంగ్లాతో వన్డే సిరీస్ లో కిషన్ డబుల్ సెంచరీ బాదాడు. ఇక మరో ఓపెనర్ గా శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ లలో ఎవరిని తీసుకుంటారో చూడాలి. గిల్ ఇంకా టీ20 అరంగేట్రం చేయలేదు కాబట్టి రుతురాజ్ ఇన్నింగ్స్ ప్రారంభించడమే లాంఛనమే అనిపిస్తోంది. ఇక 3, 4 స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ లు ఉన్నారు. 2022లో సూర్య సూపర్ ఫాంలో ఉన్నాడు. ఈ ఏడాదీ అదే దూకుడు కనబరచాలని జట్టు కోరుకుంటోంది. ఇక సంజూ ఐపీఎల్ లో లాగానే తనకిష్టమైన నాలుగో స్థానంలో ఆడతాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత వరుసగా ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లు ఉన్నారు. 


బౌలింగ్ టీమ్ ఇదే!


ఇక బౌలింగ్ విషయానికొస్తే ఈ సిరీస్ లో సీనియర్ బౌలర్ హర్షల్ పటేల్. అతనికి తోడుగా అర్హదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు పేస్ దళాన్ని నడిపించనున్నారు. కొత్త కుర్రాళ్లు ముఖేష్ కుమార్, శివమ్ మావిలు ప్రస్తుతానికి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశముంది. ఇక ప్రధాన స్పిన్నర్ బాధ్యతను యుజువేంద్ర చాహల్ మోయనున్నాడు. 


భారత తుది జట్టు (అంచనా)


ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్, అర్హదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.