Just In
INDvsENG: శ్రీకర భరత్ అద్భుత శతకం, తుది జట్టులో స్థానం ఖాయం!
Srikar Bharat: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు.
ఇంగ్లండ్(England)తో టెస్టు సిరీస్‌కు ముందు భారత వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్( Srikar Bharat) అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అహ్మదాబాద్ వేదికగా ఇండియా ఎ – ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీకర్ భరత్ సంచలన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆజేయ శతకం సాధించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భరత్.. 165 బంతుల్లో 15 ఫోర్లతో 116 పరుగులు చేశాడు.
మ్యాచ్ సాగిందిలా...
ఇండియా ఎ – ఇంగ్లండ్ లయన్స్(India A Vs England Lions) మధ్య అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్.. 118 ఓవర్లలో 553 పరుగులు చేసింది. బదులుగా ఇండియా ఎ.. 47 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌట్ అయింది. రజత్ పాటిదార్ 151 పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 125 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 426 పరుగులు చేసింది. భారత్ తరఫున సాయి సుదర్శన్ 97, సర్ఫరాజ్ ఖాన్ 55, మానవ్ సుతర్ 89లతో పాటు శ్రీకర్ భరత్ సెంచరీ చేయడంతో భారత్ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. డ్రాగా ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇండియా-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఇదివరకే ప్రకటించిన తొలి రెండు టెస్టుల సిరీస్‌లో స్పెషలిస్టు వికెట్ కీపర్ కోటాలో భరత్ చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు యువ వికెట్ కీపర్ దృవ్ జురల్‌కు కూడా జట్టులో ఛాన్స్ లభించింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వికెట్ కీపర్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్.. ఈ సిరీస్‌లో కేవలం స్పెషలిస్టు బ్యాటర్‌గానే ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ సెంచరీతో భరత్‌కు వికెట్ కీపర్‌గా తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.
పకడ్బంధీ ఏర్పాట్లు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు 25 వేల మంది స్కూల్ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణలో పని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాలకు రిపబ్లిక్ డే రోజున ఉచితంగా అనుమతించాలని హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది. ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్‌కు పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) అధ్యక్షడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు వెల్లడించారు. హెచ్‌సీఏ కొత్త కార్యవర్గం ఎన్నికైన అనంతరం జరుగుతున్న తొలి క్రికెట్ మ్యాచ్ కావడంతో దీనిని పండుగలా నిర్వహించేందుకు ఈసారి కొన్ని విప్లవవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
టికెట్ల విక్రయం అంతా అన్‌లైనే
గతంలో జింఖానాలో జరిగిన తొక్కిసలాట దృష్ట్యా టిక్కెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నామని చెప్పారు. టెస్టు మ్యాచ్ అయినా సరే టికెట్ల కోసం అభిమానుల నుంచి అపూర్వ స్పందన లభించటం సంతోషకరమన్నారు. స్టేడియం నలువైపులా పైకప్పు, నూతనంగా ఏర్పాటు చేసిన కుర్చీలు, భారీ ఎల్‌ఈడీ తెరలు, ఆధునాతన ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్ల సొబగులతో మైదానాన్ని టెస్టు మ్యాచ్‌కు ముస్తాబు చేశామన్నారు.