ICC ODI World Cup 2023: భారత్(Bharat)  వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో(World Cup Final) భారత్‌ ఓడిపోయి రోజులు గడుస్తున్నాయి. అయినా అభిమానుల మది నుంచి ఆ చేదు జ్ఞాపకాలు తొలగిపోవడం లేదు. మ్యాచ్ ముగిసిన రోజు నుంచి అభిమానులంతా తీవ్ర దు:ఖంలో ఉన్నారు. మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ(Rohit Sharma) , విరాట్ కోహ్లీ(Virat Kohli), మహ్మద్ సిరాజ్(Siraj) కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇక మళ్లీ ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉండదేమో అనే బాధ అభిమానుల కలచివేస్తోంది. ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిసి నాలుగు రోజులైనా  చేదు జ్ఞాపకాలు మాత్రం టీమ్‌ఇండియా క్రికెటర్లను వదలడం లేదు. తాజాగా కేఎల్ రాహుల్‌(Kl Rahul), కుల్‌దీప్‌ యాదవ్‌(Kuldeep Yadav)ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమిపై స్పందించారు. 


సోషల్‌ మీడియాలో ఫైనల్‌ మ్యాచ్‌ ఫొటోలను షేర్‌ చేసిన కేఎల్‌ రాహుల్‌ ఇప్పటికీ బాధిస్తోందంటూ క్యాప్షన్‌ పెట్టాడు. దీనిపై నెటిజన్లు రాహుల్‌కు మద్దతుగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మీ పోరాటం అద్భుతమని, తప్పకుండా బలంగా తిరిగి వస్తారని ట్వీట్లు చేస్తున్నారు. కుల్‌దీప్‌ కూడా ఫైనల్లో ఓటమిపై స్పందించాడు. ఫైనల్‌లో ఓడినా.. తప్పకుండా పుంజుకుని వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటామని కుల్‌దీప్‌ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్‌లో తమ ప్రయాణం ముగిసిన తీరు చివర్లో నిరుత్సాహానికి గురి చేసిందని కుల్‌దీప్‌ అన్నాడు. ఆరు వారాలపాటు సాగిన మెగా టోర్నీలో తమ లక్ష్యాలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ముందుకు సాగిన విధానం మాత్రం గర్వంగా ఉందన్నాడు. ఫైనల్‌లో ఓటమి బాధ ఉన్నప్పటికీ.. తదుపరి అవకాశం కోసం తీవ్రంగా కష్టపడతామని ఈ చైనామన్‌ స్పిన్నర్‌ అన్నాడు. బాధ నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని.. జీవితమంటే ఇదే అని కుల్‌దీప్‌ భావోద్వేగానికి గురయ్యాడు. దేవుడు మరోలా తలిచాడని.. కోలుకుని రావడం కష్టమే కానీ భవిష్యత్తుపై నమ్మకం ఉంచి ప్రయాణం కొనసాగిస్తామని కుల్‌దీప్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 


భారత్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో రాహుల్‌ మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చి వేగంగా సెంచరీలు చేశాడు. భారత జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఓవైపు రోహిత్, కోహ్లీ విధ్వంసం సృష్టిస్తుంటే మరోవైపు రాహుల్‌ స్కోరు బోర్డును సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. నిశ్శబ్దంగా తన పనితాను చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఫైనల్లోనూ అద్భుతంగా పోరాడాడు. నెదర్లాండ్స్‌పై 64 బంతుల్లోనే మెరుపు శతకం బాది రికార్డు సృష్టించాడు. సెమీస్‌లో కేవలం 20 బంతుల్లో అమూల్యమైన 39 పరుగులు చేశాడు. రాహుల్‌ ఓపెనర్‌గా 23 మ్యాచ్‌ల్లో 915 పరుగులు చేశాడు. దీనిలో మూడు శతకాలు, ఆరు అర్థ శతకాలు ఉన్నాయి. సగటు 43.57 కాగా.. స్ట్రైక్‌ రేట్‌ కేవలం 79 మాత్రమే. 4, 5వ స్థానాల్లో అతడు మొత్తం 40 మ్యాచ్‌లు ఆడాడు. సగటు 56కు పైగా ఉంది. 4 శతకాలు, 11 అర్ధ శతకాలు బాది 17వందలకుపైగా పరుగులు చేశాడు.