Shreyas Iyer Injury: ఒకరు గాయపడితే దురదృష్టం అనుకోవచ్చు. కానీ ఇద్దరు, ముగ్గురు.. వరుసపెట్టి ఒకరి తర్వాత మరకొరు  గాయాల బారిన పడుతూ టీమ్‌కు దూరమైతే దానినేమనాలి..? ప్రస్తుతం టీమిండియా ఇంచుమించుగా ఇదే ఊగిసలాటలో ఉంది.  కీలక టోర్నీలు ముందుండగా జట్టులో  గాయాల పాలైన బాధితుల సంఖ్య  పెరుగుతూనే ఉంది.  ఇదివరకే   ఆరు నెలల పాటు  వికెట్ కీపర్ రిషభ్ పంత్, పేసర్ జస్ప్రిత్ బుమ్రాలు దూరమైన భారత జట్టుకు ఇప్పుడు   మరో షాక్ తాకింది. టీమిండియా  మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా  ఐదు నెలల పాటు  క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు. 


ఆ‘పరేషాన్’ తప్పదట..


గడిచిన మూడు నెలలుగా వెన్ను గాయంతో  ఇబ్బందులు పడుతున్న  శ్రేయాస్..  గతేడాది డిసెంబర్‌లో  బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ముగిసిన  తర్వాత స్వదేశంలో   శ్రీలంక, న్యూజీలాండ్ లతో  జరిగిన  పరిమిత ఓవర్ల సిరీస్ లకు దూరంగా ఉన్నాడు.  అయితే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టుకు దూరమైన అతడిని రెండో టెస్టుకు  హడావిడిగా తీసుకొచ్చి ఆడించింది బీసీసీఐ.  ఢిల్లీ, ఇండోర్‌లలో ఆడిన అయ్యర్.. అహ్మదాబాద్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు రాలేదు.  అప్పుడు  అయ్యర్ గాయానికి శస్త్రచికిత్స అవసరమని ఎన్సీఏ వైద్యులు తేల్చారు.  లేకుంటే గాయం తిరగబెట్టే ఛాన్స్ ఉందని.. అలా అయితే   అయ్యర్  అక్టోబర్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో  కూడా  ఆడే ఛాన్స్ ఉండదని హెచ్చరించారు. మొదట్లో గాయాన్ని లెక్కచేయని అయ్యర్.. తొలుత  ఐపీఎల్ లో ఆడతాడని వార్తలు వచ్చినా  ఇప్పుడు మాత్రం ఆపరేషన్ కు సిద్ధమైనట్టు  బోర్డు వర్గాల ద్వారా తెలుస్తున్నది. 


సర్జరీ అయితే.. 


బీసీసీఐ ప్రతినిధి ఒకరు పీటీఐకి తెలిపిన వివరాల ప్రకారం.. ‘అవును.. అయ్యర్ వెన్ను గాయానికి శస్త్ర చికిత్స తప్పనసరి. సర్జరీ కోసం అతడు త్వరలోనే  విదేశాల (యూకే)కు వెళ్తాడు. సర్జరీ ముగిశాక  కూడా  అతడు కనీసం  ఐదు నెలల పాటు  క్రికెట్ కు దూరంగా ఉండాల్సిందే..’ అని  తెలిపాడు. ప్రస్తుతానికి ఈ వార్త  ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఎదురుదెబ్బ. అయ్యర్  ఈ ఎడిషన్  సెకండాఫ్ లో వస్తాడని  ఆ జట్టు మేనేజ్‌మెంట్ భారీ ఆశలు పెట్టుకుంది.  కొన్ని మ్యాచ్‌ల వరకు నితీశ్ రాణాను  సారథిగా నియమించింది.  కానీ తాజా వార్తల నేపథ్యంలో రాణా పూర్తి సీజన్ పాటు కెప్టెన్ గా కొనసాగడం తప్పేలా లేదు.  


 






అయ్య ర్ సర్జరీ కేకేఆర్ తో పాటు భారత్ కు ప్రతికూలమే. ఈ ఏడాది జూన్ లో  భారత జట్టు  లండన్ లోని ‘ది ఓవల్’ వేదికగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ ఆడనుంది. ఐదు నెలల పాటు  అయ్యర్ క్రికెట్ కు దూరంగా ఉండనున్న నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్  ఆడటం కూడా కష్టమే.  ఇప్పటికే  రోడ్డు  ప్రమాదంలో గాయపడి రిషభ్ పంత్. వెన్ను గాయంతో   జస్ప్రిత్ బుమ్రాలతో పాటు  పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా    డబ్ల్యూటీసీ నుంచి తప్పుకోగా ఇప్పుడు అయ్యర్ కూడా నిష్క్రమించడం భారత్ కష్టాలను రెట్టింపు చేసేదే.   అయ్యర్ లేనిపక్షంలో  కెఎల్ రాహుల్ టీమ్ లోకి వచ్చే అవకాశాలు  మెండుగా ఉన్నాయి.