BCCI President Elections Latest Updates : బీసీసీఐ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి.. క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బోర్డు అనడంలో ఎలాంటి సందేహం లేదు... ప్రపంచ క్రికెట్ ను కొన్నేళ్లుగా శాసిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ను నియంత్రించే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా బీసీసీఐ మనసుకు అనుగుణంగా నడుచుకుంటుంది. అలాంటి బోర్డుకు ప్రెసిడెంట్ పదవి ఇప్పుడు ఖాలీగా ఉంది. త్వరలోనే ఈ పోస్టుకు చీఫ్ ను ఎన్నుకోనున్నారు. అయితే మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ఈ పదవిని అలంకరించేందుకు మెజారిటీ అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు ప్రారంభమైందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఇంతకుముందు మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ.. బీసీసీఐ చీఫ్ గా వ్యవహరించేవారు. అయితే బోర్డులోని మార్గదర్శకాల ప్రకారం 70 ఏళ్ల వయసుకు చేరుకోవడంతో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 70 ఏళ్లు దాటితే తమ పదవులను వదులుకోవాలని బోర్డు నియామవళిలో స్పష్టంగా ఉండటంతో ఈ మార్పు జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
వెస్ట్ నుంచి..వెస్ట్ జోన్ కు చెందిన కిరణ్ మోరకు మంచి అనుభవం ఉంది. గతంలో వికెట్ కీపర్ బ్యాటర్ గా తను సేవలు అందించాడు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు చెందిన మోరే.. బోర్డు చీఫ్ పదవికి దాదాపు ఖారరు అయ్యారని సమాచారం. నిజానికి బోర్డు అధ్యక్షుని పదవికి ఎన్నికలు జరగడం లేదు. బోర్డు ఆఫీస్ బేరర్ల మార్గదర్శకంలో అన్ని క్రికెట్ అసోసియేషన్లు కలిసి ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకుంటూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అదే రీతిలో మోరేను బోర్డు అధ్యక్షునిగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బోర్డు చీఫ్ ఎన్నికపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోర్దు అధ్యక్షుని పదవికి ఎన్నిక ఉండదని, దాదాపు యునానిమస్ గా ఎన్నుకుంటామని తెలిపారు. ఇక ముందుగా అనుకున్న విధంగా ఈనెల 28 నాటికి బోర్డు అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వికెట్ కీపర్ నుంచి అడ్మినిస్ట్రేటర్ గా..1962లో జన్మించిన మోరే.. భారత్ కు 1984 నుంచి 1993 వరకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ కాలంలో 49 టెస్టులు, 94 వన్డేలు ఆడాడు. మంచి వికెట్ కీపర్ గా పేరు తెచ్చుకున్న మోరే.. లోయర్ ఆర్డర్ బ్యాటర్ గా కూడా పలు ఉపయుక్త ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే 1988, 1991 ఆసియాకప్ గెలిచిన భారత జట్టులో తను సభ్యునిగా ఉన్నాడు. రిటైర్మైంట్ తర్వాత క్రికెట్ కార్యకలపాల్లోనే ఎక్కువగా పాలుపంచుకున్నాడు. కోచ్ గా, అడ్మినిస్ట్రేటర్గా కీలక పాత్ర పోషించాడు. బోర్డు సెలెక్టర్ గా సేవలందించిన మోరే.. వర్థమాన ఆటగాళ్లను వెలికి తీయడంలో తోడ్పాటు అందించాడు. ఐపీఎల్లో వికెట్ కీపర్ కన్సల్టెంట్ గా ముంబై ఇండియన్స్ కి సేవలందించాడు. అలాగే 2019లో యూఎస్ క్రికెట్ కు ఇంటెరిమ్ కోచ్, డైరెక్టర్ గా నియమించబడ్డాడు. ఆ జట్టు వన్డే హోదా సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.