Asia Cup 2025 Latest Updates : ఆసియాకప్ లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. శుక్రవారం దుబాయ్ లో జరిగిన ఆసియాకప్ లీగ్ మ్యాచ్ లో ఒమన్ పై 93 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ .. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసింది. వన్ డౌన్ మ్యాటర్ మమ్మద్ హరీస్ సూపర్ ఫిఫ్టీ (43 బంతుల్లో 66, 7 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో అమీర్ కలీమ్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం టార్గేట్ ఛేజింగ్ లో ఏదశలోనూ ఒమన్ విజయం వైపు కు వెళ్లలేదు. బౌలర్లలో ధాటికి 16.4 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. వన్ డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా (27) టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాక్ బౌలర్లలో సయిమ్ అయూబ్, సుఫియన్ ముఖీమ్, ఫహీం అష్రఫ్ కు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో పాక్ ఈ టోర్నీలో బోణీ కొట్టింది. తర్వాత మ్యాచ్ లో ఇండియాతో ఆదివారం (ఈనెల 14న) దుబాయ్ లో పాక్ ఆడుతుండగా, యూఏఈతో సోమవారం (ఈనెల 15న) ఒమన్ తలపడుతుంది.
అయూబ్ డకౌట్..పాక్ మాజీ ఆటగాళ్లు పేర్కొన్న విధంగా అయూబ్ ధాటిగా ఆడలేదు. భారత్ తో మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టే అవకాశం ఆయూబ్ కు ఉందని మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించగా, ఒమన్ పై మాత్రం తొలి బంతికే తను డకౌటయ్యాడు. దీంతో ఆ మాజీ క్రికెటర్ పై ట్రోలింగ్ నడుస్తోంది. కూన బౌలర్లనే ఎదుర్కొని అయూబ్.. భారత బౌలర్ల ముందు తేలిపోతాడని విమర్శిస్తున్నారు. ఇక అయూబ్ ఔటైనా.. ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ (29) తో కలిసి హరీస్ కీలక భాగస్వమ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కుదురుగా ఆడటంతో పాక్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఆ తర్వాత ఫర్హాన్ ఔటైనా, ఫఖార్ జమాన్ (23) మినహా మిగతా వారంతా తేలిపోయారు. ఆఖరికి ఫిఫ్టీ చేసుకున్నాక హరీస్ కూడా ఔటవడంతో ఓ మోస్తరు స్కోరు కే పాక్ పరిమితమైంది.
టపటపా..కాస్త పెద్ద టార్గెట్ తో బరిలోకి దిగిన ఒమన్ ఏ దశలోనూ లక్ష్యం వైపు అడుగులు వేయలేదు. ఆరంభంలోనే కెప్టెన్ కమ్ ఓపెనర్ జతిందర్ సింగ్ (1) వికెట్ ను కోల్పోయిన ఒమన్.. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. హమ్మద్ తోపాటు ఓపెనర్ అమీర్ కలీమ్ (13), షకీల్ అహ్మద్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా, మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఒమన్ కు భారీ పరాజయం ఖాయమైంది. మిగతా బౌలర్లలో షాహిన్ షా ఆఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, మహ్మద్ నవాజ్ కు తలో వికెట్ దక్కింది. హరీస్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక గాయంతో ఫిట్ నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడని భావిస్తున్న కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఈ మ్యాచ్ లో ఆడాడు. అయితే తను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు.