Asia cup 2025, Ban Super Victory vs Hkg Match : ఆసియా కప్ లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. గురువారం అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హాంకాంగ్ పై ఏడు వికెట్లతో గెలుపొందింది. అన్ని రంగాల్లో రాణించిన బంగ్లా.. కంఫర్టబుల్ విక్టరీని తన సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 143 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ నిజఖాత్ ఖాన్ (40 బంతుల్లో 42, 2 ఫోర్లు, 1 సిక్సర్) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, రిషాద్ హుస్సేన్ లకు తలో రెండు వికెట్లు లభించాయి. అనంతరం టార్గెట్ ను 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసి, బంగ్లా ఛేదించింది. లిటన్ దాస్ కెప్టెన్ ఇన్నింగ్స్ (39 బంతుల్లో 59, 6 ఫోర్లు, 1 సిక్సర్)తో సూపర్ ఫిఫ్టీ కొట్టి, టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో అతీఖ్ ఇక్బాల్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ ఫార్మాట్ లో హాంకాంగ్ పై బంగ్లాకిదే తొలి విక్టరీ కావడం విశేషం. ఇక ఈ పరాజయంతో హాంకాంగ్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్ లో ఆఫ్గానిస్తాన్ చేతిలోనూ ఓడిన హాంకాంగ్.. రెండు పరాజయాలతో అట్టడుగున నిలిచింది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప, ఆ జట్టు ఇంటిముఖం పట్టడం ఖాయమే.
రాణించిన బౌలర్లు..టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించిన బంగ్లాకు బౌలర్లు చక్కని సహాకారం అందించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ, ప్రత్యర్థిపై పై చేయి సాధించేలా చేశారు. ఈ ఇన్నింగ్స్ లో ఒక్క ఫిఫ్టీ భాగస్వామ్యం కూడా లేక పోవడం విశేషం. నిజఖత్ తోపాటు ఓపెనర్ జీషాన్ అలీ (30), కెప్టెన్ యాసిమ్ ముర్తుజా (28) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. మిగతా వాళ్లు బ్యాట్లు ఎత్తేయడంతో హాంకాంగ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. దీంతో ప్రత్యర్థి ముందు కాస్త చిన్న టార్గెట్ నే నిర్దేశించింది.
దాస్ కా దమ్కీ..ఇక చిన్న టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాకు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే ఓపెనర్లు పర్వేజ్ హుస్సేన్ ఈమన్ (19), తంజిద్ హసన్ (14) వికెట్లను కోల్పోయింది. వన్ డౌన్ బ్యాటర్ గా బరిలోకి దిగిన కెప్టెన్ లిటన్ దాస్ తన సత్తా చాటాడు. తౌహిద్ హృదయ్ (36 బంతుల్లో 35 నాటౌట్, 1 ఫోర్) తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఒక ఎండ్ లో తౌహిద్ యాంకర్ రోల్ పోషించగా, దాస్ మాత్రం కాస్త వేగంగా ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను సునాయసంగా ఎదుర్కొన్న దాస్.. 33 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టాడు. ఈ క్రమంలో మూడో వికెట్ కు 95 పరుగులు జోడించాక, ఆఖర్లో దాస్ ఔటయ్యాడు. ఆ తర్వాత జాకీర్ అలీ తో కలిసి తౌహిద్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. అర్ద సెంచరీ చేసిన దాస్ కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తర్వాత మ్యాచ్ లో శనివారం (ఈనెల 13న) శ్రీలంకతో బంగ్లా, సోమవారం (ఈనెల 15న) శ్రీలంకతోనే హాంకాంగ్ తలపడనుంది.