Asia cup 2025, Salman Agha Doubtful For Ind vs Pak Match : చిరకాల ప్రత్యర్థి ఇండియాతో పోరుకు ముందు పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగిలే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. తాజాగా జట్టు ప్రాక్టీస్ సెషన్ లో తను ఒంటరిగా ఉండటం, వొంటికి బ్యాండేజీతో ఉండటంతో ఈమ్యాచ్ కు తను అనుమానమేనని తెలుస్తోంది. నిజానికి తను మెడనొప్పితో బాధపడుతున్నాడు. ఇందుకు సంబంధించిన ట్రీట్మెంట్ ను తీసుకుంటున్నప్పటికీ, ఆశించిన ఫలితం రావడం లేదని తెలుస్తోంది. ఈక్రమంలో తాజాగా ప్రాక్టీస్ సెషన్లో తను పాల్గొనక ఊరికే ఒకచోట కూర్చుని విశ్రాంతి తీసుకోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జట్టంతా డ్రిల్, ఫుట్ బాల్ ఆడటం, ఇతర వ్యాయమాలు చేయడంలో బిజీగా ఉంటే, సల్మాన్ మాత్రం ఒంటరిగా ఉండటంపై తన ఫిట్ నెస్ పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒమన్ తోపోరు..ఆసియాకప్ లో భాగంగా ఆదివారం దుబాయ్ లో పాక్, భారత్ జట్ల మధ్య పోరు జరుగనుంది.ఈ మ్యాచ్ కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఆసక్తి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాక్ ఒమన్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నీలో పాక్ కు ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో సల్మాన్ ఆడతాడని టీమ్ మేనేజ్మెంట్ ప్రకటన చేసింది. తను ప్రాక్టీస్ సెషన్ కు రాకున్నప్పటికీ, ఈ మ్యాచ్ లో ఆడుతుండటంపై చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా భారత్ తో పోరుకు కాస్త ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక భారత్ ఈ టోర్నీలో ఇప్పటికే తొలి మ్యాచ్ ను ఆడేసింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య యూఏఈపై 9 వికెట్లతో రికార్డు విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
ఫుల్ ప్రిపరేషన్..ఇటీవల చిన్న జట్లపై కూడా అంతంతమాత్రం ప్రదర్శన చేస్తున్న పాక్.. ఆసియా కప్ కోసం మాత్రం బాగానే ప్రిపేర్ అయింది. టోర్నీ వేదికైన దుబాయ్ లో ఆసియాకప్ కు ముందు ఆఫ్గానిస్థాన్, యూఏఈలతో కలిసి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఈ టోర్నీ విజేతగా నిలవడంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసం కాస్త బాగుంది. దుబాయ్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతోపాటు మందకొడిగా ఉండటంతో ఆ మేరకు జట్టులో మార్పులు చేసుకుంది. ఎక్కువగా స్పిన్నర్లకు చోటు కల్పించింది. అయితే ఇదే టోర్నీలో ఆఫ్గాన్ చేతిలో పాక్ ఓడిపోవడం గమనార్హం. ఏదేమైనా ఇండియాతో పోరులో మెరుగైన ప్రదర్శన చేయాలని ఆజట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చివరిసారిగా ఇరుజట్లు దుబాయ్ లోనే జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తలపడగా, భారత్ సునాయస విజయాన్ని సాధించింది.