Ranchi Test News: నాలుగో టెస్టు మ్యాచ్‌కు అంతరాయం కలిగిస్తానంటూ అమెరికా ఉగ్ర‌వాది గురుప‌త్వంత్ సింగ్ ప‌న్నున్(Terrorist Pannun) వార్నింగ్ నేప‌థ్యంలో ఇంగ్లండ్‌(England), ఇండియా(India) మ‌ధ్య రాంచీ(Ranchi)లో  భ‌ద్ర‌త‌ను పెంచారు. ఇండ్లండ్‌, భార‌త్ మ‌ధ్య జ‌రిగే టెస్టు మ్యాచ్‌ను అడ్డుకోవాల‌ని అత‌ను సోష‌ల్ మీడియాలో ఓ వీడియోలో అప్‌లోడ్ చేశాడు. మ్యాచ్‌ను అడ్డుకోవాలంటూ ఆయ‌న సీపీఐ ద‌ళాన్ని కోరారు.  బెదిరింపుల నేపథ్యంలో జార్ఖండ్ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ జేఎస్సీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ది. మంగ‌ళ‌వార‌మే ఇంగ్లండ్ జ‌ట్టు రాంచీ చేరుకున్న‌ది.


 నాలుగో టెస్ట్‌కు బుమ్రా దూరం, రాహుల్ కూడా 


రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ర్పిత్‌ బుమ్రా(Bumrah) ఆడడం లేదు. పని భారం ఎక్కువ అవుతుండడంతో  కీలకమైన నాలుగో టెస్ట్‌కు  బుమ్రాకు  విశ్రాంతి ఇచ్చారు. బుమ్రాను నాలుగో టెస్ట్‌లో జట్టులోకి తీసుకోలేదని... టెస్టు సిరీస్‌ వ్యవధి, ఇటీవల కాలంలో అతడి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ ప్రకటించింది. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు రాంచీ టెస్టు నుంచి విశ్రాంతినిచ్చినట్టు బీసీసీఐ(BCCI) ప్రకటించింది. ఈ టెస్టు బరిలోకి దిగుతాడనుకున్న కేఎల్‌ రాహుల్‌(K L Rahul) కూడా జట్టుకు దూరమైనట్టు బోర్డు తెలిపింది. రాహుల్‌ ఐదో టెస్టులోనూ ఆడేది లేనిది అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బోర్డు వెల్లడించింది. కేఎల్‌ రాహుల్‌ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఫిట్‌గా ఉంటే ఆఖరి టెస్టులో ఆడతాడని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. శుక్రవారం రాంచీలో ఆరంభమయ్యే నాలుగో టెస్టు కోసం బుమ్రా స్థానంలో ముకేశ్‌ కుమార్‌ జట్టుకు ఎంపికయ్యాడు.  బుమ్రా 17 వికెట్లతో ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మూడు టెస్టుల్లో 80 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. 


యశస్వీ కూడా  అనుమానమే?


వన్డే తరహా ఆట తీరుతో బ్రిటీష్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసిన జైస్వాల్‌... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్వి శతకంతో మెరిసి అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్‌ నాలుగో టెస్ట్‌కు దూరమవుతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలినట్లే. యశస్వీ జైశ్వాల్‌ గాయం కారణంగా రాంచీ టెస్ట్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైశ్వాల్‌ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడుతూనే యశస్వీ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. వెన్ను నొప్పి కారణంగా మూడో రోజు ఆటలో సెంచరీ పూర్తిచేశాక రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగిన జైశ్వాల్‌.. మళ్లీ నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌కు వచ్చి తన రెండో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఫీల్డింగ్‌ చేసేటప్పుడు కూడా జైస్వాల్‌ ఆసౌక్యర్యంగా కన్పించాడు. ఈ క్రమంలో అతడికి రాంచీ టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెన్‌జ్మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జైస్వాల్‌ నాలుగో టెస్ట్‌కు దూరమైతే దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ అరంగేట్రం జరిగే అవకాశం ఉంది.