దేశవాళీ క్రికెట్‌లో భాగంగా బీసీసీఐ(BCCI) నిర్వహించే అండర్‌-19 టోర్నమెంట్‌లో సంచలనం నమోదమైంది. కూచ్‌బెహార్‌ ట్రోఫీ అండర్‌19 (Karnataka Under 19 ) మ్యాచ్‌లో కర్నాటక –ముంబై (Karnataka vs Mumbai )మధ్య జరిగిన మ్యాచ్‌లో క్వాడ్రపుల్‌ సెంచరీ నమోదైంది. కూచ్ బెహ‌ర్ ట్రోఫీ ఫైన‌ల్​లో అత్యధిక స్కోరు సాధించిన భార‌త క్రికెట‌ర్‌గా ప్రకర్‌ చతుర్వేది రికార్డుకెక్కాడు. అండ‌ర్‌-19 స్థాయిలో నిర్వహించే నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఏకంగా 400కు పైగా ప‌రుగులు సాధించాడు.


సంచలన ప్రదర్శన
ముంబైపై కర్ణాటకకు చెందిన ప్రకర్‌ చతుర్వేది సంచలన ప్రదర్శన చేసి అబ్బురపరిచాడు. క్వాడ్రపుల్‌ సెంచరీ చేసి కర్నాటకకు ఆధిక్యంతో పాటు ట్రోఫీని కూడా సాధించిపెట్టాడు. కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన చతుర్వేది.. 638 బంతులు ఎదుర్కుని 46 బౌండరీలు, మూడు భారీ సిక్సర్ల సాయంతో 404 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కర్నాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 890 పరుగుల భారీ స్కోరుచేసింది. . మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కర్నాటకకు చతుర్వేదితో పాటు హర్షిల్‌ ధర్మని (169) కూడా రాణించడంతో కర్నాటక భారీ స్కోరు చేయగలిగింది. అలా కర్ణాటకకు 510 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఆఖరి రోజు కర్ణాటక డిక్లేర్ ఇవ్వడం, ఫలితం తేలే అవకాశం లేకపోవడం వల్ల ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో టోర్నీ నిబంధనల ప్రకారం మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సంపాదించుకున్న కర్ణాటకను విజేతగా అనౌన్స్​ చేశారు. అలా ఆ జట్టు కూచ్ బెహార్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.  సంచలన ప్రదర్శన చేసి అబ్బురపరిచిన కర్ణాటక బ్యాటర్‌ ప్రకర్‌ చతుర్వేదిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కూచ్ బెహర్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ మ్యాచులో నాలుగొందల పైచిలుకు పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చతుర్వేది నిలిచాడు. 


లారా ఒక్కడే
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 400 పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ బ్రియాన్ లారా. అంతర్జాతీయ కెరీర్‌లో ఈ విండీస్ క్రికెట్ దిగ్గజం పరుగుల వరద పారించాడు.  బ్రియాన్ లారా టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 582 బంతులు ఎదుర్కొన్న లారా 4 భారీ సిక్సర్లు, 43 ఫోర్లతో అజేయంగా 400 పరుగులు చేశాడు. అయితే, ఈ రికార్డ్ ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. అయితే, తాజాగా ఈ రికార్డ్ ఎవరు బ్రేక్ చేస్తారో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ జోస్యం చెప్పాడు. స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా వస్తే బ్రియాన్ లారా పేరిట ఉన్న 400 పరుగుల రికార్డును కూడా బద్దలు కొట్టగలడు. ఎందుకంటే, స్మిత్ రోజంతా బ్యాటింగ్ చేయగల ఆటగాడు. అందుకే, టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా మైదానంలోకి దిగితే 400 పరుగుల రికార్డును అధిగమించినా ఆశ్చర్యపోనవసరం లేదని మైకేల్ క్లార్క్ తెలిపాడు.