Just In





Vijay Hazare Trophy Final: కర్ణాటక పాంచ్ పటాకా.. విఫలమైన కరుణ్ నాయర్, 36 పరుగులతో విదర్భ చిత్తు
ఐదోసారి కర్ణాటక విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఓడిపోని అజేయ రికార్డున శనివారం మరోసారి ప్రదర్శించింది. ఫైనల్లో విధర్భను చిత్తు చేసింది.

Karnataka Vs Vidarbha: విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాకట డామినేషన్ కొనసాగుతోంది. ఐదోసారి టైటిల్ దక్కించుకుని సత్తా చాటింది. టోర్నీ చరిత్రలో ఎన్నడూ టైటిలో ఓడిపోని రికార్డును శనివారం కూడా కొనసాగించింది. ఇప్పటివరకు నాలుగు సార్లు ఫైనల్ కు చేరిన కర్ణాటక, నాలుగుసార్లూ టైటిల్ నెగ్గింది. శనివారం ఐదోసారి కూడా అదే ఫీట్ రిపీట్ చేసి, పాంచ్ పటాకా కొట్టింది. టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ తీసుకోవాలని నిర్ణయించిన కరుణ్ నాయర్ నిర్ణయం బెడిసి కొట్టింది.
నిర్ణీత 50 ఓవర్లలో కర్ణాటక 6 వికెట్లకు 348 పరుగుల భారీ స్కోరు చేసింది. రవిచంద్రన్ స్మరణ్ మెరుపు సెంచరీ (92 బంతుల్లో 101, 7 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం ఛేదనలో 48.2 ఓవర్లలోనే 312 పరుగులకు ఆలౌటైన విదర్భ.. 36 పరుగులతో ఓడిపోయింది. రవిచంద్రన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, కరుణ్ నాయర్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు దక్కింది.
ఆదుకున్న స్మరణ్..
తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. బౌలర్లు కట్టడి చేయడంలో ఓ దశలో 67/3తో నిలిచింది. ఈ దశలో స్మరణ్.. మిగతా బ్యాటర్లతో కలిసి జట్టును ముందుకు నడిపించాడు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ క్రిష్ణన్ శ్రీజిత్ (78), అభినవ్ మనోహర్ (79)లతో కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న స్మరణ్-క్రిష్ణన్ జంట నాలుగో వికెట్ కు 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత క్రిష్ణన్ వెనుదిరిగగా, మనోహర్ తో కలిసి ఐదో వికెట్ కు 106 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. ఈక్రమంలోనే 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని ఔటయ్యాడు. చివర్లో మనోహర్ బ్యాట్ ఝుళిపించడంతో వేగంగా పరుగులు వచ్చాయి. తను కూడా కేవలం 34 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. బౌలర్లలో దర్శన్ నల్కండే, నచికేత్ భుటేకి రెండేసి వికెట్లు దక్కాయి.
కరుణ్ నాయర్ విఫలం..
ఈ టోర్నీలో అద్భుతఫామ్ లో ఉన్న కరుణ్ నాయర్ (22) ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. దీంతో విదర్భ ఆరంభంలోనే ఒత్తిడిలో పడిపోయింది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్ల చలవతో అజేయంగా ఫైనల్ కు చేరిన విదర్భ.. ముఖ్యమైన మ్యాచ్ లో యశ్ రాథోడ్ (22), కరుణ్ విఫలం కావడం దెబ్బ తీసింది. మరో ఎండ్ లో ఓపెనర్ ధ్రువ్ షోరే స్టన్నింగ్ సెంచరీ (111 బంతుల్లో 110, 8 ఫోర్లు, 2 సిక్సర్లు)తో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ టోర్నీలో తనకిది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం.
చివర్లో హర్ష్ దూబే (63) 30 బంతుల్లోనే 63 పరుగులు చేసినా లాభం లేకుండా పోయింది. బౌలర్లలో వాసుకి కౌశిక్, ప్రసిధ్ కృష్ణ, అభిలాష్ శెట్టి మూడేసి వికెట్లతో సత్తా చాటారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో విదర్భ కనీసం మొత్తం ఓవర్లు కూడా ఆడలేక పోయింది. దీంతో 36 పరుగుల విజయం కర్ణాటక సొంతం అయ్యింది.