Kohli Gambhir Clash: మూడు నెలల క్రితం ముగిసిన ఐపీఎల్ - 2023లో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, స్టార్ బ్యాటర్ గౌతం గంభీర్‌ల మధ్య తలెత్తిన వివాదం ఈ ఇద్దరి పరువూ తీసింది. లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌తో గొడవపడ్డ కోహ్లీ.. మ్యాచ్ ముగిశాక లక్నో మెంటార్ గౌతం గంభీర్‌తో కూడా గొడవపడ్డాడు. తప్పొప్పులు ఎవరివైనా ఈ గొడవ ఈ ఇద్దరు అభిమానులనే గాక మాజీ క్రికెటర్లనూ విస్మయానికి గురి చేసింది. సుమారు దశాబ్దం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గంభీర్.. 2008 నుంచి ఆడుతున్న కోహ్లీలు ఆటగాళ్లుగా ఎదిగినా క్రీడాస్ఫూర్తి విషయంలో మాత్రం దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరించారు.
తాజాగా ఈ వివాదంపై టీమిండియా దిగ్గజ సారథి కపిల్ దేవ్ స్పందించాడు. ‘ది వీక్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్.. కోహ్లీ వర్సెస్ గంభీర్ గొడవపై మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరూ క్రికెటర్లుగానే కాదు .. మంచి పౌరులుగా కూడా ఎదగాలి. కోహ్లీ - గంభీర్ మధ్య జరిగిన వివాదం నాకు చాలా బాధ కలిగించింది. వీళ్లిద్దరంటే నాకు చాలా ఇష్టం. విరాట్ ప్రపంచస్థాయి బ్యాటర్. గంభీర్ పార్లమెంట్ మెంబర్.. అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ఎలా వ్యవహరిస్తారు..?’ అని ప్రశ్నించాడు.
అయితే క్రీడాకారులు కూడా అందరిలాగే మాములు మనుషులే అని.. వాళ్లు కూడా అప్పుడప్పుడు ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతారని కపిల్ దేవ్ చెప్పడం గమనార్హం. ఇందుకు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే నుంచి లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ వరకూ ఎవరూ అతీతులు కాదని చెప్పాడు.
కాగా ఈ వివాదం తర్వాత విరాట్ కోహ్లీ - గౌతం గంభీర్ - నవీన్ ఉల్ హక్‌లు తమ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొద్దిరోజుల తర్వాత కోహ్లీ ఈ వివాదంపై సైలెంట్ అయినా నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ సెటైరికల్ పోస్టులు పెడుతూనే ఉన్నాడు. గంభీర్ ఇంటర్వ్యూలలో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. కొద్దిరోజుల క్రితం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. ‘ధోని, కోహ్లీలతో నా రిలేషన్‌షిప్ ఒకేలా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్‌లో ఏదైనా జరిగినా అది అక్కడివరకే ఉంటుంది గానీ ఆఫ్ ది ఫీల్డ్ అయితే కాదు.. వ్యక్తిగతంగా ఏదీ ఉండదు. వాళ్లు ఎలా అయితే మ్యాచ్ గెలవాలని కోరుకుంటారో నేనూ అదే మైండ్ సెట్‌తో ఉంటా..’అని చెప్పాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial