Ravindra Jadeja on Kapil Dev: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో  భారత జట్టు  ఓడిన తర్వాత  టీమిండియా దిగ్గజ కెప్టెన్  కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న  క్రికెటర్లకు అహంకారం ఎక్కువైందని, తనను గానీ దిగ్గజ బ్యాటర్  సునీల్ గవాస్కర్‌ను గానీ  ఎవరూ సలహాలు అడిగేందుకు రావడం లేదని   కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా రవీంద్ర జడేజా  ఘాటుగా స్పందించాడు.   మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు ఇలాంటివి సహజమేనని లైట్ తీసుకున్నాడు. 


మాకేం వ్యక్తిగత ఎజెండాలు లేవు.. 


కపిల్ వ్యాఖ్యలపై  జడ్డూ స్పందిస్తూ..‘ఆయన (కపిల్ దేవ్) ఏం చెప్పాడో నాకు తెలియదు. సోషల్ మీడియాలో కూడా నేను దాని గురించి వెతకలేదు. అయినా  ప్రతిఒక్కరికీ వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ ఉంది. ఆయనకూ  ఆయన అభిప్రాయాన్ని  చెప్ప హక్కుఉంది. కానీ ప్రస్తుతం టీమిండియాలో  అహంకారం అనేదే లేదు. అలాంటి క్వాలిటీస్ ఉన్న మెంబర్స్ కూడా లేరు...


టీమ్‌లో అందరూ తమ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.  అందరూ కష్టపడుతున్నారు.   ఎవరూ ఏదీ గ్రాంట్‌గా తీసుకోవడం లేదు. మ్యాచ్‌లో 100 శాతం ప్రదర్శననే ఇస్తున్నారు. ఇలాంటి కామెంట్స్  టీమిండియా మ్యాచ్ ఓడిపోయినప్పుడు వస్తాయి. ఇవన్నీ సర్వసాధారణం. కానీ టీమ్ ఇప్పుడు భాగుంది. మేం దేశం తరఫున ఆడేందుకు గర్వపడుతున్నాం.. మా మెయిన్ మోటో కూడా దేశాన్ని గెలిపించడమే.. మాకు వ్యక్తిగత ఎజెండాలు ఏమీ లేవు..’అని స్పష్టం చేశాడు. 


 






కపిల్ ఏం చెప్పాడు..? 


రెండ్రోజుల క్రితం ‘ది వీక్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘ఉన్నఫళంగా డబ్బు అధికంగా వచ్చిపడితే  కొన్సిసార్లు  అహంకారం వస్తుంది.  ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెటర్లు అన్నీ మాకే తెలుసనే ఫీలింగ్‌లో ఉంటారు.  క్రికెటర్ల కెరీర్‌లో  ఎత్తుపల్లాలు సహజం.  డౌన్‌లో ఉన్నప్పుడు  లెజెండరీ ఆటగాడైన సునీల్  గవాస్కర్ ఉన్నప్పుడు ఆయన సేవలను ఎందుకు వినియోగించుకోరు..?  వాళ్లకు అంత ఈగో ఎందుకు..? వాళ్లు తమకే అన్నీ తెలుసు అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఎవరైనా సలహాలు ఇచ్చినా తీసుకునేట్టు లేరు. ఒకవేళకు వాళ్లకు అన్నీ తెలిసినా  సునీల్ గవాస్కర్ వంటి  క్రికెటర్‌కు ఉన్న అనుభవం కూడా  పనికొస్తుంది కదా.   కానీ ఎవరూ  ఆయన దగ్గరకు రారు. సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ తర్వాత  ఈ తరం క్రికెటర్లు సలహాలు అడగడమే మానేశారు..’అని ఆయన చెప్పాడు.  


కాగా  భారత్ - వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు ఆఖరి పోరు జరుగనుంది. ఇదివరకే ముగిసిన రెండు వన్దేలలో ఇరు జట్లూ చెరో మ్యాచ్‌ను గెలుచుకున్నాయి.  నేటి రాత్రి ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా  స్టేడియంలో  సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే భారత్ వన్డే సిరీస్‌ను కోల్పోవడమే గాక  2006 తర్వాత వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కూడా కోల్పోయినట్టు అవుతోంది. మరి ప్రయోగాలబాట పట్టిన భారత జట్టు చివరి వన్డేలో ఏం చేసేనో..? 












ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial