IND vs WI: భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతున్న వెస్టిండీస్ త్వరలోనే  ప్రారంభం కాబోయే  టీ20 సిరీస్‌కు జట్టును ఎంపికచేసింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు   రోమన్ పావెల్ సారథిగా వ్యవహరించనున్నాడు. పలువురు సీనియర్ల రాకతో పాటు  మాజీల రీఎంట్రీతో  దుర్బేధ్యంగా కనబడుతున్న విండీస్.. ఈనెల 3 నుంచి భారత్‌తో జరుగబోయే  ఐదు మ్యాచ్‌ల  సిరీస్‌కు  టీమ్‌ను  ప్రకటించింది.  కైల్ మేయర్స్ పావెల్‌కు డిప్యూటీగా ఉండనున్నాడు. 


సీనియర్ల రీఎంట్రీ.. 


పావెల్ సారథ్యంలోని ఈ జట్టులో విండీస్ వన్డే టీమ్ కెప్టెన్ షై హోప్‌తో పాటు సీమర్  ఓషేన్ థామస్, షిమ్రన్ హెట్‌మెయర్ రీఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు  సిక్సర్ల వీరుడు నికోలస్ పూరన్  జట్టుతో కలవనున్నాడు.  వీళ్ల రాక  విండీస్ టీ20 టీమ్‌ను మరింత బలపరిచేదే.. హోప్,  థామస్‌లు  2021 నుంచి జాతీయ జట్టు తరఫున టీ20లు ఆడలేదు.  హెట్‌మెయర్  కూడా  రెండేండ్ల నుంచి  విండీస్ తరఫున ప్రాతినిథ్యం వహించలేదు.  


టెస్టులు, వన్డేలలో అంతగా  ప్రభావం చూపకపోయినా టీ2‌0లలో మాత్రం విండీస్‌తో అంత వీజీ కాదు.  కరేబియన్ వీరులు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లలో భాగస్వామిగా ఉన్నవాళ్లే  గాక  బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరుపులు మెరిపించేవారే.   తాజాగా ఎంపిక చేసిన జట్టును కూడా వచ్చే ఏడాది స్వదేశంలో జరుగబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే ఎంపికచేశారు సెలక్టర్లు..  బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో  అత్యుత్తమ ఆటగాళ్లను పరీక్షించడంతో పాటు  రైట్ కాంబినేషన్స్‌ను సెట్ చేయడానికి తమకు ఈ సిరీస్ బాగా ఉపయోగపడుతోందని   కెప్టెన్ పావెల్ చెప్పాడు. 


బ్యాటింగ్‌లో  కైల్ మేయర్స్, హోప్, ఛార్లెస్, ఛేజ్, హెట్‌మెయర్,  నికోలస్ పూరన్‌, పావెల్‌తో పాటు  హోల్డర్, స్మిత్ కూడా  బ్యాట్ ఝుళిపించేవాళ్లే.. బౌలింగ్‌లో షెపర్డ్, స్మిత్,  హోల్డర్, హోసెన్, జోసెఫ్‌లు భారత జట్టుకు  షాకులివ్వడానికి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. 


టీ20లకు విండీస్ జట్టు ఇదే : రోమన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ ఛార్లెస్, రోస్టన్ ఛేజ్, షిమ్రన్ హెట్‌మెయర్, జేసన్ హోల్డర్, షై హోప్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, రొమారియా షెపర్డ్,  ఒడియన్ స్మిత్, ఓషేన్ థామస్ 


 






భారత్ - వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ :  


- ఆగస్టు 03 : తొలి టీ20 - ట్రినిడాడ్ 
- ఆగస్టు 06 : రెండో టీ20 - గయానా 
- ఆగస్టు 08 : మూడో టీ20 - గయానా
- ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా
- ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా


ఐదు మ్యాచ్‌ల సిరీస్‌‌లో భాగంగా ఆఖరి రెండు  మ్యాచ్‌‌లు  అమెరికా (ఫ్లోరిడా)లో జరుగుతాయి. 













ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial