Kapil Dev on SKY:  శ్రీలంకతో ఆఖరిదైన మూడో టీ20లో అద్భుత శతకం సాధించిన సూర్యకుమార్ యాదవ్ పై... భారత మాజీ లెజెండ్ కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఆటగాళ్లు శతాబ్దంలో ఒకరు కనిపిస్తారని సూర్యను ఆకాశానికెత్తేశారు. 


రాజ్ కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లంక బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి.. టీ20 కెరీర్ లో మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మైదానం నలువైపులా అతను కొట్టిన షాట్లకు అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. మాజీలు, అభిమానులు, ప్రస్తుత ఆటగాళ్లు సూర్య ఇన్నింగ్స్ ను అద్భుతమంటూ కొనియాడారు. 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ సూర్య ఆటను ఆకాశానికెత్తేశాడు.


అతని ఆటకు మాటలు సరిపోవు


'వివియన్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్లు అద్భుత ఆటగాళ్లు. వీరు ఆటను నిర్వచించారు. అయితే శతాబ్దానికి ఒకసారి సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లు వస్తుంటారు.' అని కపిల్ అన్నారు. 'కొన్నిసార్లు అతని ఆటను వర్ణించడానికి పదాలు సరిపోవడంలేదు. సచిన్, రోహిత్, కోహ్లీని చూసినప్పుడు ఆ జాబితాలో ఉండేలా మరో ఆటగాడు ఉంటాడని అనిపిస్తుంది. నిజానికి భారత్ లో చాలా ప్రతిభ ఉంది. అతను ఆడే క్రికెట్ బౌలర్ ను భయపెడుతుంది.' అని కపిల్ అన్నారు. 


'సూర్య లైన్ అండ్ లెంగ్త్ ను నిలకడగా ఎంచుకుంటాడు. ఇది బౌలర్ కు కష్టమవుతుంది. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, కోహ్లీ, రికీ పాంటింగ్ వంటి గొప్ప బ్యాటర్లను నేను చూశాను. అయితే చాలా తక్కువమంది మాత్రమే బంతిని క్లీన్ గా కొట్టగలరు. సూర్యకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆటగాళ్లు శతాబ్దానికి ఒక్కసారే వస్తారు.' అని ఈ లెజెండ్ అన్నారు. 


విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత భారత క్రికెట్ లో అభిమానులు విపరీతంగా అలరిస్తున్న బ్యాటర్లలో సూర్యకుమార్ ముందుంటాడనడంలో సందేహంలేదు. 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్య ఏడాదిలోనే టీ20ల్లో నెంబర్ 1 ర్యాంకు సాధించాడు. గతేడాది సూర్య బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. అదే ఫాంను ఈ ఏడాది కొనసాగిస్తున్నాడు.