ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్ కోసం స్టార్ ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను తన 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంచుకున్నాడు. అతను అత్యంత స్వేచ్ఛతో ఆడాడని, స్టార్లతో నిండిన టీమిండియా లైనప్‌లో నమ్మశక్యం కాని రీతిలో ఆకట్టుకుంటున్నాడు." అని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ఫైనలిస్టులు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం, జోస్ బట్లర్ తాము 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అని అనుకుంటున్న ఆటగాళ్ల పేర్లు తెలిపారు. ఐసీసీ శుక్రవారం నాడు ఈ అవార్డు పొందడానికి పోటీలో ఉన్న తొమ్మిది మంది ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో స్టార్ భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. నాలుగు అర్ధసెంచరీలతో 296 పరుగులతో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా విరాట్ ఉన్నాడు.


ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాదబ్ ఖాన్, పాకిస్థాన్ పేస్ స్పియర్‌హెడ్ షహీన్ అఫ్రిది, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్, ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా, శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా ఉన్నారు.


"సూర్యకుమార్ యాదవ్ ఈ అవార్డు సాధిస్తాడని నేను అనుకుంటున్నాను. సూర్యకుమార్ యాదవ్ చాలా స్వేచ్ఛతో ఆడిన వ్యక్తి . అతను ఆడిన విధానం అద్భుతంగా ఉంది." అని జోస్ బట్లర్ తెలిపినట్లు ఐసీసీ పేర్కొంది. టోర్నమెంట్‌లో 189.68 స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు కూడా సాధించాడు.


తన సహచరులు ఆల్‌రౌండర్ శామ్ కరన్, బ్యాటర్ అలెక్స్ హేల్స్ కూడా ఈ అవార్డును గెలుచుకునే అవకాశం ఉందని బట్లర్ చెప్పాడు. టోర్నమెంట్‌లో 10 వికెట్లతో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కరన్ ఉన్నాడు. అలెక్స్ హేల్స్ ఐదు ఇన్నింగ్స్‌లలో 52.75 సగటుతో రెండు అర్ధ సెంచరీలతో 211 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ స్వయంగా ఐదు మ్యాచ్‌ల్లో 49.75 సగటుతో రెండు అర్ధసెంచరీలతో 199 పరుగులు సాధించాడు.


మరోవైపు, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన జట్టు ఆల్ రౌండర్ షాదబ్ ఖాన్‌ను అవార్డుకు ఎంపిక చేశాడు. పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోవడంలో అతని సహకారం కీలకంగా ఉంది. షాదబ్ ఖాన్ టోర్నమెంట్‌లో తన జట్టు తరపున 10 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 52 పరుగులు చేశాడు.