Ind Vs Eng Manchestar Test: ఇంగ్లాండ్ వెట‌ర‌న్ బ్యాట‌ర్ జో రూట్ మ‌రో అరుదైన ఘ‌న‌త ముందు నిలిచాడు. ఈనెల 23 నుంచి జ‌రిగే నాలుగో టెస్టులోనే ఈ మైలురాయిని అందుకోవాల‌ని అత‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో రూట్ ఐదో స్తానంలో ఉన్నాడు. త‌ను ఇప్ప‌టివ‌ర‌కు 156 టెస్టుల్లో 285 ఇన్నింగ్స్ ఆడి 13,259 ప‌రుగులు చేశాడు. మ‌రో 120 ప‌రుగులు చేస్తే, ఈ జాబితాలో ఏకంగా త‌ను రెండో స్థానానికి ఎగ‌బాకుతాడు. ఈక్ర‌మంలో మాంచెస్ట‌ర్ టెస్టులోనే త‌ను ఈ ఘ‌న‌త సాధించాల‌ని కోరుకుంటున్నాడు. ఇక ఐదు టెస్టుల అండ‌ర్స‌న్-టెండూల్క‌ర్ సిరీస్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 258  ప‌రుగులు చేసిన రూట్.. ఎనిమిదో స్తానంలో నిలిచాడు. ఇందులో ఒక సెంచ‌రీ, ఒక అర్ద సెంచ‌రీ ఉన్నాయి. 

అచ్చొచ్చిన వేదిక‌..నాలుగో టెస్టు వేదికైన మాంచెస్ట‌ర్ లో రూట్ కి తిరుగులేని రికార్డు ఉంది. ఈ వేదిక‌పై అత్య‌ధిక టెస్టు ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ గా రికార్డు నెల‌కొల్పాడు. ఇప్ప‌టివ‌ర‌కు 11 టెస్టులాడిన రూట్.. 19 ఇన్నింగ్స్ ల్లో 978 ప‌రుగులు చేశాడు. స‌గ‌టు 65.20 కావ‌డం విశేషం. ఇందులో ఒక సెంచ‌రీ, ఏడు ఫిఫ్టీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 254 కావ‌డం విశేషం. ఇక అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో భార‌త మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. త‌ను 200 టెస్టుల‌లో 329 ఇన్నింగ్స్ ఆడి 15, 921 ప‌రుగులు చేశాడు. ఇందులో 51 సెంచ‌రీలు, 68 ఫిఫ్టీలు ఉన్నాయి. స‌గ‌టు 53.78 కాగా, అత్య‌ధిక స్కోరు 248 నాటౌట్.

నాలుగో టెస్టులో వీరిని దాటేస్తాడా..?ఇక లీడింగ్ ర‌న్ స్కోర‌ర్స్ లో రూట్ కంటే ముందు.. నాలుగో స్థానంలో భార‌త మాజీ కోచ్, దిగ్గ‌జం రాహుల్ ద్ర‌విడ్ ఉన్నాడు. త‌ను 164 టెస్టుల్లో 13, 288 ప‌రుగులు చేశాడు. అత‌ని త‌ర్వాత మూడో స్థానంలో జాక్వ‌స్ క‌లిస్ (166 టెస్టుల్లో 13,289 ప‌రుగులు),రెండో స్థానంలో ఆస్ట్రేలియ‌న్ గ్రేట్ రికీ పాంటింగ్ (168 టెస్టుల్లో 13,378 ప‌రుగులు) ఉన్నాడు. తొలుత 31 ప‌రుగులు చేస్తే క‌లిస్ ను రూట్ దాటేస్తాడు. ఆ త‌ర్వాత మ‌రో 90 ప‌రుగులు చేస్తే పాంటింగ్ ను కూడా రూట్ దాటేయ‌గ‌ల‌డు. అప్పుడు లీడింగ్ ర‌న్ స్కోర‌ర్ లిస్టులో రూట్ రెండో స్తానానికి ఎగ‌బాకుతాడు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి, మాంచెస్ట‌ర్ టెస్టులోనే ఈ ఘ‌న‌త సాధించాల‌ని రూట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రూట్ టెస్టు కెరీర్ విష‌యానికొస్తే ఇప్ప‌టివ‌ర‌కు 156 టెస్టులాడిన ఈ ఇంగ్లీష్ బ్యాట‌ర్.. 285 ఇన్నింగ్స్ లో 13,259 ప‌రుగులు సాధించాడు. ఇందులో 37 సెంచ‌రీలు, 66 ఫిఫ్టీలు ఉన్నాయి. స‌గ‌టు 50.80 కాగా, అత్య‌ధిక స్కోరు 262 కావ‌డం విశేషం.