Ajinkya Rahane Comments: ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్ లో భార‌త్ ప్ర‌స్తుతం వెనుకంజ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే ఈనెల 23 నుంచి మాంచెస్ట‌ర్ లో జ‌రిగే నాలుగో టెస్టులో విజ‌యం సాధించాలంటే టీమిండియాలో క‌చ్చితంగా ఒక బిగ్ మార్పు జ‌ర‌గాల్సిందేన‌ని వెట‌ర‌న్ భార‌త క్రికెట‌ర్ అజింక్య ర‌హానే వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని బ‌లోపేతం చేయాల‌ని పేర్కొన్నాడు. మూడో టెస్టులో ఎనిమిదో నెంబ‌ర్ వ‌ర‌కు బ్యాటింగ్ చేయ‌గ‌ల ఆట‌గాళ్ల‌ను పెట్టుకుని 193 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించ‌లేక టీమిండియా చ‌తికిల‌ప‌డింది. ముఖ్యంగా ముగ్గురు ఆల్ రౌండ‌ర్ల‌తో ఆడ‌టంతో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ అంత‌గా స‌త్తా చాట లేక పోయింది. అందుచేత బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసిన‌ట్ల‌యితే బాగుంటుంద‌ని పేర్కొన్నాడు. 

Continues below advertisement


కీల‌క‌మార్పు..
భార‌త ప్లేయింగ్ లెవ‌న్ లో కీల‌క మార్పు చేయాల‌ని ర‌హానే సూచించాడు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ బౌల‌ర్ ను మ‌రొకరిని ఆడించాల‌ని పేర్కొన్నాడు. బ్యాటింగ్ లో విఫ‌ల‌మ‌వుతున్న నితీశ్ రెడ్డి స్థానంలో ఏస్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ ను ఆడించాల‌ని సూచించాడు. ఇంగ్లాండ్ లో 20 వికెట్ల‌ను త్వ‌ర‌గా తీయ‌గ‌లిగితేనే విజ‌యం సాధించే అవ‌కాశ‌ముందని, మూడో టెస్టులో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే ఫ్రంట్లైన్ బౌలర్లు జ‌స్ ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ సింగ్, మ‌హ్మ‌ద్ సిరాజ్ లతో మాత్ర‌మే ఆడింది. నితీశ్ తోపాటు ర‌వీంద్ర జ‌డేజా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ల‌ను ఆడించింది. అయితే వీరు ముగ్గురు బ్యాటింగ్ ఆల్ రౌండ‌ర్లే కావ‌డం  విశేషం.


ఆల్ రౌండ‌ర్ల‌పై మ‌క్కువ‌..
భార‌త హెడ్ కోచ్ గౌతం గంభీర్ కు ఆల్ రౌండ‌ర్ల‌పై మ‌క్కువ ఎక్కువ‌. అందుకే జ‌ట్టులో ముగ్గురు ఆల్ రౌండ‌ర్లు ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో నితీశ్ బౌలింగ్ లో ఫ‌ర్వాలేద‌నిపిస్తుండ‌గా, బ్యాటింగ్ లో తేలిపోయాడు. అటు జ‌డేజా బ్యాటింగ్ లో ఆక‌ట్టుకుంటున్న‌ప్ప‌టికీ, బౌలింగ్ లో అంత‌గా రాణించ‌డం లేదు. ఇక సుంద‌ర్.. మాత్రం రెండు విభాగాల్లో ఉనికి చాటుకున్నాడు. దీంతో నాలుగో టెస్టులో టీమిండియా కూర్పుపై సందిగ్ధ‌త ఏర్పడింది. ఈ క్ర‌మంలో ప‌లువురు మాజీలు ప‌లు ర‌కాలుగా స‌ల‌హాలు ఇస్తున్నారు. ఇక రెండో టెస్టులో ఓడిన ఇంగ్లాండ్ అద్భుతంగా పుంజుకుని, విజ‌యం సాధించింద‌ని ర‌హానే ప్ర‌శంసించాడు. ముఖ్యంగా జ‌ట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వంద శాతం ఎఫ‌ర్ట్ను అన్ని విబాగాల్లో, మ్యాచ్ అంత‌టా కొనసాగించాడ‌ని పేర్కొన్నాడు. ముఖ్యంగా రిష‌భ్ పంత్ ర‌నౌట్ విష‌యం ఈ విష‌యాన్ని నిరూపిస్తుంద‌ని పేర్కొన్నాడు. ఇక నాలుగో టెస్టులో గెలిచి, సిరీస్ నెగ్గాల‌ని ఇంగ్లాండ్ స‌మ‌రోత్సాహంతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఇరుజట్లు తప్పనిసరిగా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయపడటంతో అతని స్తానంలో మరో ఆటగాడిని ఇంగ్లాండ్ ఆడించబోతోంది. ఇక భారత్ కూడా మరో ఎగస్ట్రాబౌలర్ తో ఆడే అవకాశముంది. అలాగే వరుసగా విఫలం అవుతున్న కరుణ్ నాయర్ పై కూడా వేటు పడవచ్చు.