Jaydev Unadkat Comeback:  భారత ఫాస్ట్ బౌలర్ జైదేవ్ ఉనద్కత్ దాదాపు 12 ఏళ్ల తర్వాత తన రెండో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2010లో ఈ లెఫ్టార్మ్ బౌలర్ టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అయితే ఆ మ్యాచ్ తర్వాత అతనికి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో జైదేవ్ తన రెండో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ అనంతరం అతను ట్విటర్ లో మనసును హత్తుకునే పోస్ట్ ఒకటి పెట్టాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. 


జెర్సీల పోస్ట్ వైరల్


2010లో తను అరంగేట్రం చేసినప్పటి జెర్సీనీ, ప్రస్తుతం తను బంగ్లాదేశ్ తో ఆడిన రెండో టెస్ట్ మ్యాచ్ జెర్సీని కలిపి జైదేవ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తన ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా ఉన్నాడు. సచిన్, సెహ్వాగ్ లాంటి ఆటగాళ్లు అప్పటి జట్టులో ఉన్నారు. వారి సంతకాలన్నీ ఆ జెర్సీ మీద ఉన్నాయి. ఇప్పుడు కేఎల్ రాహుల్ నేతృత్వంలో రెండో టెస్ట్ ఆడాడు. ఇప్పడు జట్టులో ఉన్న వారి సంతకాలను జైదేవ్ తన జెర్సీ మీద తీసుకున్నాడు. ఆ రెండింటినీ పక్కపక్కన పెట్టి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇన్ని సంవత్సరాల మధ్య ప్రయాణానికి ఇవి గుర్తులు అని దానికి క్యాప్షన్ ను జతచేశాడు. ప్రస్తుతం ఉనద్కత్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఉనద్కత్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లోనే అతడు టెస్టుల్లో తన తొలి వికెట్ తీశాడు. దీనిపైన జైదేవ్ మాట్లాడాడు. నేను నా మొదటి టెస్టులో వికెట్ తీయలేదు. భారత్ తరఫున వికెట్ తీయాలని నేను ఎన్నో కలలు కన్నాను. ఈ మధ్యలో ఆ క్షణాన్ని ఎన్నోసార్లు విజువలైజ్ చేసుకున్నాను. నాకు మళ్లీ భారత్ తరఫున ఆడే అవకాశం వచ్చినప్పుడు నేను తొలి టెస్టులో వికెట్ తీయలేదనేదే అందరిలోనూ చర్చ. అని బీసీసీఐకు ఇచ్చిన వీడియోలో ఉనద్కత్ పేర్కొన్నాడు.