Jasprit Bumrah Surgery: 


టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా శస్త్రచికిత్స పూర్తైంది! న్యూజిలాండ్‌లోని ఓ స్పెషలిస్టు వద్ద అతడు వెన్నెముకకు సోమవారం సర్జరీ చేయించుకున్నాడని తెలిసింది. అతడు కోలుకొనేందుకు ఆరు నెలల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాల సమాచారం. బహుశా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అందుబాటులో ఉండొచ్చు.


మార్చి నెల మొత్తం బుమ్రా (Jasprit Bumrah) న్యూజిలాండ్‌లోనే ఉంటాడని తెలిసింది. అతనెప్పుడు తిరిగి రావాలో, ఎప్పుడు రిహాబిలిటేషన్‌కు వెళ్లాలో బీసీసీఐ (BCCI) వైద్య నిపుణుల బృందం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆగస్టులో పేసుగుర్రం తిరిగి బౌలింగ్‌ శిక్షణ పొందుతాడు. ఆ తర్వాత మెల్లగా అతడి పనిభారాన్ని పెంచుతారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధం చేస్తారు.


గతేడాది సెప్టెంబర్‌ నుంచి జస్ప్రీత్‌ బుమ్రా క్రికెట్‌ ఆడలేదు. వెన్నెముక దిగువన నొప్పి రావడంతో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. అప్పట్నుంచీ విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో పునరాగమనం చేసేందుకు బలంగా ప్రయత్నించాడు. శ్రీలంక సిరీసుకూ ఎంపికయ్యాడు. అయితే వెన్నెముకలో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడంతో తప్పించారు.


సర్జరీ కావడంతో ఈ ఏడాది ఐపీఎల్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఆసియాకప్‌నకు జస్ప్రీత్‌ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. బీసీసీఐ వైద్య బృందం యుద్ధ ప్రాతిపదికన బుమ్రా కేసును పర్యవేక్షించినట్టు తెలిసింది. దాంతో బీసీసీఐ, ఎన్‌సీఏ సమన్వయంతో శస్త్రచికిత్సకు నిర్ణయం తీసుకున్నారు.


కొన్ని రోజుల క్రితం నడుం నొప్పి, వెన్నెముక గాయాలతో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఇబ్బంది పడ్డాడు. అతడికి సర్జన్‌ రొవాన్‌ షూటెన్‌ చికిత్స అందించాడు. తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ సన్నద్ధం చేశాడు. ఆయన క్రైస్ట్‌చర్చ్‌లో ఉంటారని తెలిసింది. అర్థోపెడిక్స్‌లో రినోవ్‌డ్‌ సర్జన్‌ గ్రాహమ్‌ ఇంగ్లిస్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. షేన్‌ బాండ్‌ సహా ఎందరో కివీస్‌ క్రీడాకారులకు గ్రాహమ్‌ వైద్యం చేశారు. ముంబయి ఇండియన్స్‌కు బాండ్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే షూటెన్‌ పేరును ఆయనే సూచించారని సమాచారం.


క్రీడాకారుల గాయాలు నయం చేయడంలో షూటెన్‌ది అందెవేసిన చేయి! ఒక క్రమ పద్ధతిలో ఆయన గాయాలను నయం చేస్తారని పేరుంది. ఆస్ట్రేలియా పేసర్‌ జేమ్స్‌ ప్యాటిన్‌సన్‌కు ఇంగ్లిస్‌ సర్జరీ చేస్తున్నప్పుడు షూటెన్‌ ఆయన సహాయకుడిగా ఉన్నారు. బెన్‌ డ్వారుషియిస్‌, జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌, జోఫ్రా ఆర్చర్‌ వంటి క్రికెటర్లు వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆయనే సర్జరీలు చేశారు.


Also Read: ఆర్సీబీ.. పేపర్‌పై ఆడ పులులా! గుజరాత్‌ జెయింట్స్‌నైనా ఓడిస్తారా!


Also Read: మెగ్‌గ్రాత్‌ చితక్కొట్టినా సరిపోని పోరాటం - యూపీపై డీసీదే గెలుపు!


Also Read: గల్లీ క్రికెట్లో సుప్లా షాట్‌ ఆడిన సూర్య - వైరల్‌ వీడియోకు మస్తు క్రేజ్‌!