BGT Test Series: భారత్, ఆసీస్ మధ్య శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో మూడో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎడతెగని వర్షం వల్ల, తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ కు ఏమాత్రం కలిసిరాలేదు. ఓవర్ కాస్ట్ కండీషన్స్, పిచ్ పై పచ్చిక ఉండటంతో బౌలర్లు పండుగా చేసుకుంటారని భావించినప్పటికీ, అలాంటి సన్నివేశం ఏమీ జరగలేదు. ముఖ్యంగా భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. పిచ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్ లో స్వింగ్, మూవ్మెంట్ లేదని బౌలింగ్ చేస్తున్న సందర్భంగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారం అంతా స్టంప్ కెమెరాలో రికార్డయ్యింది. దీన్ని భారత అభిమానులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తై వైరల్ చేశారు.
ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో..
నిజానికి తొలుత భారత బౌలింగ్ ఆరంభించిన బుమ్రా.. తన బౌలింగ్ లో వేరియేషన్లు చూపిస్తూ బౌలింగ్ చేశాడు. అయితే పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఒకింత నిరాశకు లోనయ్యాడు. ఇక ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బౌలింగ్ వేసిన బుమ్రా..తన లైన్ అండ్ లెంగ్త్ ను కొంచెం మార్చుకున్నాడు. అయినప్పటికీ తనకు కావాల్సిన విధంగా, స్వింగ్, మూవ్మెంట్ లేదని సహచర ప్లేయర్లకు చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆరు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా.. మూడు మెయిడిన్లు వేసి, కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. హర్షిత్ రాణా ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ఆకాశ్ దీప్ ఆకట్టుకున్నాడు 3.2 ఓవర్లలో రెండు మెయిడిన్లు వేసి, కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక సిరాజ్ నాలుగు ఓవర్లు వేసి, రెండు మెయిడిన్లతో 13 పరుగులిచ్చి, మిగతా బౌలర్లతో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాడు. మూడో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఎడతెగని వర్షం కురవడంతో శనివారం తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. నిజానికి ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే చిన్నగా జల్లులు కురవడంతో మ్యాచ్ ను ఆపేశారు. అలా కొంతసేపు అంతరాయం తర్వాత మళ్లీ మ్యాచ్ ను మొదలు పెట్టారు. అయితే మళ్లీ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో వర్షం అడ్డుపడటంతో మ్యాచ్ ముందుకు సాగలేదు.
Also Read: India vs Australia LIVE Updates: తొలిరోజు వర్షం అడ్డంకి - కేవలం 13.2 ఓవర్ల ఆటే సాధ్యం, టీమిండియాలో రెండు మార్పులు
బుమ్రాపై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసలు..
భారత పేసర్ బుమ్రాపై మాజీ కోచ్, ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించాడు. దిగ్గజ పేసర్లు డెన్నిస్ లిల్లీ, ఆండీ రాబర్ట్స్, రిచర్డ్ హ్యాడ్లీ ల కలబోతే బుమ్రా అని కొనియాడాడు. బుమ్రా ఒక పరిపూర్ణ బౌలరని, వెన్నెముక శస్త్ర చికిత్స కారణంగా సుదీర్ఘం కెరీర్ ఉంటుందో లేదోనని, ఉంటే మాత్రం తనో దిగ్గజంగా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పదునైన యార్కర్లు, ప్రత్యర్థిని వణికించే బౌన్సర్లతో లిల్లీని బుమ్రా గుర్తు చేస్తున్నాడని ప్రశంసించాడు. బుమ్రాను అడ్డుకుంటే ఆసీస్.. బోర్డర్- గావస్కర్ సిరీస్ కైవసం చేసుకోగలదని సూచించాడు.
Also Read: Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!