Brisbane Test: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఎడతెగని వర్షం కురవడంతో శనివారం తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. నిజానికి ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే చిన్నగా జల్లులు కురవడంతో మ్యాచ్‌ను ఆపేశారు. అలా కొంతసేపు అంతరాయం తర్వాత మళ్లీ మ్యాచ్‌ను మొదలుపెట్టారు. అయితే మళ్లీ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో వర్షం అడ్డుపడటంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. ఈక్రమంలో లంచ్ బ్రేక్‌ను కాస్త ముందుగానే తీసుకున్నప్పటికీ, వరుణుడు ఎంతకు శాంతించలేదు. దీంతో రెండు, మూడు సెషన్లు వేచి చూసిన ఆంపైర్లు ఆఖరికి తొలిరోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు.
భారత్ రెండు మార్పులు..
అందరూ అనుకున్నట్లుగానే భారత్ రెండు మార్పులతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. విఫలమవుతున్న పేసర్ హర్షిత్‌ను అనుకున్నట్లుగానే పక్కన పెట్టిన భారత టీం మేనేజ్మెంట్, అతని స్థానంలో ఆకాశ్ దీప్‌ను జట్టులోకి తీసుకుంది. ఇక రెండో టెస్టులో విఫలమైన భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆశ్చర్యకరంగా రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకుంది. నిజానికి వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంటారని భావించినా, బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు గతంలో ఇక్కడ రాణించిన అనుభవం జడేజాకు ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ అతని వైపే మొగ్గినట్లు తెలుస్తోంది.
Also Read: Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
టాస్ నెగ్గి బౌలింగ్ తీసుకున్న భారత్..
ఓవర్ కాస్ట్ కండీషన్లతోపాటు ప్రారంభంలో బౌలింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాతో భారత కెప్టెన్ రోహిత్ టాస్ నెగ్గగానే బౌలింగ్ తీసుకున్నాడు. అయితే అతను అనుకున్నట్లుగా తొలి 13 ఓవర్లలో ఆసీస్ వికెట్లేమీ కోల్పోలేదు. నాథన్ మెక్ స్విన్నీ (4 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా (19 బ్యాటింగ్)తో భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తొలి రోజు ఆటముగిసే సరికి ఆసీస్ వికెట్లేమీ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. బౌలర్లు కూడా చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ స్టంప్ లైన్‌లో బౌలింగ్ వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలని చూశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. బౌలర్ స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హేజిల్ వుడ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఇక బ్రిస్బేన్‌లో రాబోయే 3 రోజులు వర్షం కురుస్తుందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం వరకు వర్షం మ్యాచ్‌కు అడ్డు కలిగించే అవకాశముందని పేర్కొంది. ఇక తొలిరోజు ఆట నష్టంతో రెండో రోజు కాస్త ముందుగానే ఆటను మొదలుపెడతారు. వర్షం అడ్డు రాకుంటే రోజుకు 98 ఓవర్లపాటు బౌలింగ్ చేసే అవకాశముంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది.
Also Read: 2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!