WTC Final 2023: ఐపీఎల్-16 కు ముందే భారత క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపిన  తరుణం రానే వచ్చింది. 2013లో  ఇంగ్లాండ్‌పై ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఐసీసీ టైటిల్ కరువులో ఉన్న టీమిండియా.. ఈసారైనా దానిని ఒడిసిపట్టాలని చూస్తున్నది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ అయితే బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.  డబ్ల్యూటీసీ ఫైనల్ ఫోటో షూట్‌లో భాగంగా సోమవారం ఐసీసీ విడుదల చేసిన ఫోటోలలో  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ  ఎడమవైపు నిల్చున్నాడు. దీంతో ఫ్యాన్స్‌ కూడా ‘లెఫ్ట్ సైడ్ సెంటిమెంట్’పై ఆశలు పెట్టుకున్నారు. 


ఏంటీ లెఫ్ట్  సైడ్ సెంటిమెంట్..? 


ఐసీసీ ఈవెంట్లలో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరిగేముందు ఇరు జట్ల సారథులు ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిస్తారు. అయితే గడిచిన  పది, పదిహేను సంవత్సరాలుగా ఐసీసీ చరిత్ర చూసుకుంటే ఫోటో షూట్‌లలో ట్రోఫీకి ఎడమ వైపు  నిల్చున్న  సారథులే   ఎక్కువసార్లు కప్ గెలిచారు. ఇందుకు ఆధారాలు కూడా రాక్ సాలిడ్‌గా ఉన్నాయి. 


 






ధోనితో మొదలు.. 


2011 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ధోని-సంగక్కరలు ట్రోఫీతో ఫోజిచ్చిన ఫోటోలో ధోని ఎడమ వైపు నిల్చున్నాడు.  భారత్ ఆఖరిసారి గెలిచిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ  (2013) లో కూడా ధోని- అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) దిగిన ఫోటోలో మహీ ఎడమవైపే నిల్చున్నాడు.  ఇక 2015 వన్డే వరల్డ్ కప్  ‌లో భాగంగా మైఖేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా)  -  బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్)  ఫోటో దిగగా క్లార్క్ ఎడమవైపునే నిల్చున్నాడు.  2016  టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో డారెన్ సామి (వెస్టిండీస్)  లెఫ్ట్ సైడ్ ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) రైట్ సైడ్ ఉన్నాడు. 


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2019 లో భారత - పాక్ ఫైనల్ చేరాయి.  పాక్ సారథి సర్ఫరాజ్ ఖాన్ ఎడమవైపున ఉండగా  కోహ్లీ కుడివైపు నిల్చున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌ ట్రోఫీతో ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) లెఫ్ట్  సైడ్ నిల్చోగా  కేన్ విలియమ్సన్ (కివీస్)  కుడివైపున ఉన్నాడు. 2021  టీ20 వరల్డ్ కప్‌లో ఆరోన్ ఫించ్ (ఆసీస్) ఎడమవైపున ఉండగా కేన్ విలియమ్సన్ (కివీస్) కుడివైపు ఉన్నాడు. 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ లెఫ్ట్  సైడ్ ఉండగా  కోహ్లీ రైట్ సైడ్ నిల్చున్నాడు. 


పైన పేర్కొన్న ప్రతీ సందర్భంలోనూ ఎడమ వైపు నిల్చున్న సారథి నేతృత్వం వహించిన జట్టే  ఐసీసీ ట్రోఫీ గెలిచింది.  ఈ లెక్కన చూసుకుంటే డబ్ల్యూటీసీ  ఫైనల్ ఫోటోషూట్‌‌లో  టీమిండియా  సారథి రోహిత్ శర్మ ఎడమవైపున నిల్చున్నాడు. ఈ సెంటిమెంట్‌ను బట్టి చూస్తే  భారత్‌కు పదేండ్ల తర్వాత   ఐసీసీ ట్రోఫీ వచ్చినట్టేనని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. 


 






బాబర్‌ను మరిచిపోవద్దు.. 


ఫోటోషూట్ లో ట్రోఫీకి ఎడమవైపున ఉన్న కెప్టెన్  టైటిల్ గెలుస్తున్నాడని చరిత్ర చెబుతున్నా 2022 టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం ఇది రివర్స్ అయింది.  మెల్‌బోర్న్ వేదికగా గతేడాది ముగిసిన ఇంగ్లాండ్ - పాకిస్తాన్ ఫైనల్‌  లో ఇంగ్లీష్ జట్టే గెలిచింది. ఫోటో షూట్ లో  పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ ఎడమ వైపే నిల్చున్నా ట్రోఫీ మాత్రం కుడివైపున ఉన్న జోస్ బట్లర్ సేననే వరించింది. నమ్మకాలను శాస్త్రీయంగా నిరూపించబడే సైన్స్ కంటే ఎక్కువగా నమ్మే టీమిండియా ఫ్యాన్స్  నమ్మకం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి మరి..!