Ireland Beat Afghanistan in Only Test: పసికూన ఐర్లాండ్‌(Irland) చరిత్ర సృష్టించింది. పసికూన ముద్రను చెరిపేసుకుంటూ ఐర్లాండ్‌ సంచలనం సృష్టించింది. ఆరేళ్ల క్రితం టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌ సుదీర్ఘ ఫార్మట్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్‌(Afghanistan)తో అబుదాబిలోని టోలరెన్స్‌ ఓవల్‌ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో ఆండ్రూ బల్బిర్ని సారథ్యంలోని ఐర్లాండ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 111 పరుగుల ఛేదనను ఐర్లాండ్‌ విజయవంతంగా ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 155 పరుగులు చేయగా ఐర్లాండ్‌ 263 రన్స్‌కు ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌కు 108 పరుగుల ఆధిక్య దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గాన్‌.. 218 పరుగులకే పరిమితమవడంతో ఐర్లాండ్‌ ఎదుట 111 పరుగుల లక్ష్యం ఉండగా.. 13 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ను బల్బిర్ని 56 నాటౌట్‌, టక్కర్‌ 27 నాటౌట్‌ విజయతీరానికి చేర్చారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 72 పరుగులు జోడించి ఐర్లాండ్‌కు చారిత్రక విజయాన్ని అందించారు. 




 

అయిదో టెస్ట్‌కు టీమిండియా సిద్ధం

ధర్మశాల వేదికగా మార్చి ఏడు నుంచి 11 వరకు అయిదో టెస్ట్‌ జరగనుంది. ఇప్పటికే టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ టెస్ట్‌లోనూ గెలిచి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్లు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని బ్రిటీష్‌ జట్టు చూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు అరుదైన రికార్డు సృష్టించనున్నారు. టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్రన్ అశ్విన్‌, ఇంగ్లాండ్ బ్యాట‌ర్ జానీ బెయిర్ స్టోలకు ఈ మ్యాచ్  ప్రతిష్టాత్మకంగా నిల‌వ‌నుంది. అశ్విన్‌, జానీ బెయిర్ స్టోలు త‌మ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు ఎలా రాణిస్తారు అన్న అంశంపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ మ్యాచ్ ఎవ‌రికి తీపి గుర్తుగా మిగ‌ల‌నుందో మ‌రికొద్ది రోజుల్లో తేల‌నుంది.

 

కేవలం 13 మంది మాత్రమే

టీమ్ఇండియా త‌రుపున ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 13 మంది ఆట‌గాళ్లు మాత్రమే టెస్టుల్లో వంద‌కు పైగా మ్యాచ్‌లు ఆడారు. అశ్విన్ 14వ ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. భార‌త్ త‌రుపున అత్యధిక టెస్టులు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో స‌చిన్ టెండూల్కర్  200 టెస్టులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత 163 టెస్టుల‌తో రాహుల్ ద్రవిడ్ రెండో స్థానంలో ఉన్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్ 200 టెస్టులు ఆడగా... రాహుల్ ద్రవిడ్ 163 ఆడగా.. వీవీఎస్‌ లక్ష్మణ్ 134, అనిల్‌ కుంబ్లే 132, కపిల్‌ దేవ్ 131, సునీల్‌ గవాస్కర్ 125, దిలీప్‌ వెంగ్‌సర్కార్ 116, సౌరవ్‌ గంగూలీ 113, విరాట్‌ కోహ్లీ 113, ఇషాంత్‌ శర్మ 105, హర్భజన్‌ సింగ్ 103, ఛతేశ్వర్‌ పుజారా 103, వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్ట్‌లు ఆడారు. అశ్విన్  ఇప్పటి వ‌ర‌కు 99 టెస్టులు ఆడాడు. 507 వికెట్లు ప‌డ‌గొట్టాడు. బ్యాటింగ్‌లో 3309 ప‌రుగులు చేశాడు. ఇటీవ‌ల ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. ఇంగ్లాండ్ త‌రుపున ఇప్పటి వ‌ర‌కు బెయిర్ స్టో 99 టెస్టులు ఆడాడు 36.43 స‌గ‌టుతో 5974 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.