Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్‌లో ఓడినా తమకు పోయేదేమీ లేదంటున్నాడు గుజరాత్ టైటాన్స్ సారథి హార్ధిక్ పాండ్యా.  ఇక్కడ ఓడినా ఫైనల్  లో సీఎస్కేతో తలపడబోయేది తమ టీమేనని  బల్లగుద్ది మరీ చెబుతున్నాడు.  మరి కుంగ్‌ఫూ పాండ్యాది అతివిశ్వాసమో ఆత్మ విశ్వాసమో గానీ మ్యాచ్ ముగిశాక అతడి  వ్యాఖ్యలు  మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


చెపాక్ వేదికగా  చెన్నై - గుజరాత్‌ల మధ్య ముగిసిన మ్యాచ్ అనంతరం హార్ధిక్ మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం మేం  బౌలింగ్ లో కొన్ని తప్పులు చేశాం. అవి బేసిక్ ఎర్రర్స్ అయినా మ్యాచ్‌పై చాలా ప్రభావం చూపాయి. ఇంత మంచి బౌలింగ్ యూనిట్ మాకున్నా మేం  15 పరుగులు అదనంగా సమర్పించుకున్నాం.   మా వ్యూహాలకు తగ్గట్టుగా మేం  వ్యవహరించినా సఫలం కాలేకపోయాం.  అయితే మేం దాని గురించి భూతద్దంలో పెట్టి వెతకాల్సిన పన్లేదు. రెండ్రోజుల్లో   మేం  మరో మ్యాచ్ ఆడతాం. ఆ తర్వాత ఫైనల్‌ ఆడతాం..  ఈ మ్యాచ్ ఓడినందుకు పెద్దగా చింతించాల్సిన పన్లేదు..’అని చెప్పాడు. 


 






ఇక ఈ మ్యాచ్‌లో ధోని తన బౌలర్లను  ఉపయోగించుకున్న విధానం అద్భుతమని  హార్ధిక్ కొనియాడాడు. అదే అతడిలోని బ్యూటీ అని.. ధోని ఫీల్డ్ లో ఉంటే ప్రత్యర్థి జట్టు మరో పది పరుగులు అదనంగా   చేయాల్సి వస్తుందని  అన్నాడు. ఈ మ్యాచ్ లో తమ జట్టు  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిందని.. ఆ మేరకు  ధోని కూడా తన బౌలర్లను చక్కగా వినియోగించుకున్నాడని  పాండ్యా తెలిపాడు.  ఆదివారం మళ్లీ ధోనితో అహ్మదాబాద్‌లో ఫైనల్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నాడు.  


 






చెన్నైతో ఫస్ట్ క్వాలిఫయర్ ఓడినందుకు ఏమైనా చింతిస్తున్నారా...? అని కామెంటేటర్స్ ప్రశ్నించగా.. ‘జీవితంలో ఎప్పుడూ రిగ్రీట్ అవకూడదు. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్ సమయంలో  మంచు  ప్రభావం ఎక్కువుంటుందిన భావించాం. కానీ  మేం ఊహించినట్టుగా జరుగలేదు.   మేం 15 పరుగులు అదనంగా ఇవ్వడమే కాకుండా  కొన్ని  విభాగాల్లో ఫెయిల్  అయ్యాం.  కానీ రాబోయే మ్యాచ్ లో మేం పుంజుకుంటాం..’ అని  వ్యాఖ్యానించాడు.   అంతేగాక   ముంబై - లక్నో మధ్య జరుగబోయే మ్యాచ్‌ను చూస్తారా..? అని  అడగ్గా.. ‘తప్పకుండా. నా బ్రదర్ ఆడుతున్నాడు.  నేను అతడు   అహ్మదాబాద్‌ కు రావాలని (క్వాలిఫయర్ - 2 జరిగేది ఇక్కడే)  కోరుకుంటున్నా..’అని తెలిపాడు. 


కాగా ఫస్ట్ క్వాలిఫయర్ ముగిసిన నేపథ్యంలో  నేడు  (మే 24న) చెన్నై వేదికగానే   లక్నో సూపర్ జెయింట్స - ముంబై ఇండియన్స్ మధ్య  ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన  విజేత.. మే 26  అహ్మదాబాద్ వేదికగా  జరుగబోయే క్వాలిఫయర్ - 2 లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుంది.   క్వాలిఫయర్ - 2  లో గెలిచిన జట్టు.. మే 28న  అహ్మదాబాద్ వేదికగానే  చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ ఆడుతుంది.