Rajinikanth Calls Rinku Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ లో వెలుగులోకి వచ్చిన కుర్ర ఆటగాళ్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బ్యాటర్ రింకూ సింగ్ ఒకరు. ఐదు సీజన్లుగా కేకేఆర్‌తో ఉన్నా రాని గుర్తింపు గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ లో లాస్ట్ ఓవర్లో కొట్టిన ఐదు సిక్సర్లతో వచ్చింది. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న రింకూ.. ఇటీవలే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కూడా లాస్ట్ బాల్‌కు బౌండరీ బాది కేకేఆర్‌కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ మాట్లాడుతూ.. తనకు సూపర్ స్టార్ రజినీ కాంత్ ఫోన్ చేసి అభినందించాడని.. చెన్నై వస్తే ఇంటికి రావాలని ఆహ్వానించాడని చెప్పుకొచ్చాడు.
పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత రింకూ సింగ్ జియో సినిమాతో జహీర్ ఖాన్, రాబిన్ ఊతప్పలతో కలిసి చాట్ చేశాడు. ఈ సందర్భంగా యాంకర్.. ‘ఆ ఐదు సిక్సర్ల తర్వాత ఎవరెవరి నుంచి నీకు ఫోన్స్, మెసేజెస్ వచ్చాయి..?’ అని అడిగాడు. అప్పుడు రింకూ మాట్లాడుతూ.. ‘చాలా మంది నుంచి మెసేజెస్ వచ్చాయి. రజినీ సార్ (సూపర్ స్టార్ రజినీకాంత్) నుంచి కాల్ వచ్చింది. ఆయన నా ఆటను అభినందించారు. చెన్నై వచ్చినప్పుడు ఇంటికి రావాలని ఆహ్వానించారు..’అని చెప్పాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదే వీడియోలో రింకూ.. ‘రజినీ సార్ ఇంగ్లీష్ లో ఏదో మాట్లాడారు. నాకు ఏమీ అర్థం కాలేదు..’అని చెప్పడం నవ్వులు పూయిస్తున్నది.
ఐపీఎల్-16 లో ఈడెన్ గార్డెన్ లో ఇదివరకే చెన్నై తో మ్యాచ్ ఆడిన కేకేఆర్.. ఈనెల 14న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరోసారి ధోనిసేనను ఢీకొనేందుకు వస్తున్నది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ నేటి రాత్రికి చెన్నైకి చేరుకునే ఛాన్స్ ఉంది. మరి రింకూ.. రజినీకాంత్ ను కలుస్తాడా..? లేదో చూడాలి.
కాగా ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తో ఆఖరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు అవసరమనగా యశ్ దయాల్ వేసిన ఓవర్‌లో ఫస్ట్ బాల్ ఉమేశ్ యాదవ్ సింగిల్ తీయగా చివరి ఐదు బంతులను రింకూ భారీ సిక్సర్లుగా మలిచాడు. పంజాబ్ తో మ్యాచ్ లో కూడా ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమనగా అర్ష్‌దీప్ వేసిన ఫుల్‌టాస్ ను బౌండరీగా మలిచి కోల్‌కతాకు విజయాన్ని అందించాడు. ఈ సీజన్ లో రింకూ.. కేకేఆర్ బ్యాటింగ్ లో ఫినిషర్ గా మారుతున్నాడు. 12 మ్యాచ్ లలో 12 ఇన్నింగ్స్ ఆడిన రింకూ.. ఐదు సార్లు నాటౌట్ గా ఉండి 146,47 స్ట్రైక్ రేట్ తో 353 పరుగులు సాధించాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.
ఇక ఐపీఎల్-16 పాయింట్ల పట్టికలో కేకేఆర్.. పంజాబ్ ను ఓడించి ఐదో స్థానానికి దూసుకొచ్చినా నిన్న రాత్రి రాజస్తాన్ చేతిలో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు ఆడబోయేది రెండు మ్యాచ్‌లే. ఈ రెండింటలోనూ గెలిచినా ఆ జట్టు ఇతర టీమ్స్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.