Rohit Sharma in IPL: ఐపీఎల్-16లో రోహిత్ శర్మ వరుసగా రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ లీగ్ లో 6 వేల పరుగుల క్లబ్ లో చేరిన హిట్‌మ్యాన్.. తాజాగా శనివారం పంజాబ్‌తో ముగిసిన మ్యాచ్‌లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. పంజాబ్ తో మ్యాచ్ లో భాగంగా రాహుల్ చాహర్ వేసిన 9వ ఓవర్లో మూడో బంతిని స్ట్రైయిట్ సిక్సర్ గా మలిచిన రోహిత్.. ఈ ఘనతను అందుకున్నాడు.
పంజాబ్ తో మ్యాచ్ కు ముందు రోహిత్.. ఐపీఎల్ లో అతడి పేరిట 247 సిక్సర్లు ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్ లో హిట్‌మ్యాన్ మూడు సిక్సర్లు బాదాడు. ఫలితంగా రోహిత్ 250 మార్క్‌ను చేరాడు. భారత ఆటగాళ్లలో ధోని, ఈ లీగ్ లో అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ కూడా రోహిత్ వెనకాలే ఉన్నారు. కాగా ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్ల రికార్డు వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది.
ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ - 5 వీరులు :
1. క్రిస్ గేల్ : 142 మ్యాచ్‌లు - 357 సిక్సర్లు
2. ఏబీ డివిలియర్స్ : 184 మ్యాచ్‌లు - 251 సిక్సర్లు
3. రోహిత్ శర్మ : 233 మ్యాచ్‌లు - 250 సిక్సర్లు
4. ఎంఎస్ ధోని : 240 మ్యాచ్‌లు - 235 సిక్సర్లు
5. విరాట్ కోహ్లీ : 229 మ్యాచ్‌లు - 229 సిక్సర్లు
పంజాబ్ తో మ్యాచ్ లో గనక రోహిత్ మరో సిక్సర్ కొట్టుంటే డివిలియర్స్ రికార్డు సమం చేసేవాడే. అయితే ఇది వచ్చే మ్యాచ్ లో రోహిత్ ఐదు ఓవర్లు క్రీజులో నిలిచినా సమం చేయడమే కాదు. బ్రేక్ కూడా చేయొచ్చు. అప్పుడు గేల్ తర్వాత ప్లేస్ లో రోహిత్ చేరతాడు. ముంబై తమ తర్వాతి మ్యాచ్ ను ఈ నెల 25న గుజరాత్ తో ఆడనుంది.
అక్కడా హిట్‌మ్యానే..
ఐపీఎల్ లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా రోహిత్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంటర్నేషనల్ లెవల్ లో మూడు ఫార్మాట్లలో కలిపి క్రిస్ గేల్.. 483 మ్యాచ్ లలో 553 సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ.. 440 మ్యాచ్‌లలో 526 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. తర్వాత షాహిద్ అఫ్రిది (476), బ్రెండన్ మెక్‌కల్లమ్ (398), మార్టిన్ గప్తిల్ (383) ఉన్నారు.
వన్డేలలో మాత్రం పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది.. 398 మ్యాచ్ లలో 351 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా గేల్ (331) సెకండ్ ప్లేస్ లో, రోహిత్ శర్మ (275) థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు.
టీ20లలో రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. 148 మ్యాచ్ లలో హిట్‌మ్యాన్ 182 సిక్సర్లు బాదాడు. రోహిత్ తర్వాత మార్టిన్ గప్తిల్ (173), ఆరోన్ ఫించ్ (125) ఉన్నారు.