Rohit Sharma In IPL: ఐపీఎల్‌లో 6వేలకు పైగా పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ -16లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. 191 పరుగులే చేశాడు. గడిచిన ఐదు ఇన్నింగ్స్ లలో రోహిత్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. తద్వారా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఈ సీజన్‌లో పంజాబ్, చెన్నైపై మ్యాచ్ లలో డకౌట్ అయి ఐపీఎల్‌లో అత్యధిక సార్లు (16) డకౌట్ అయిన ఆటగాడిగా ఓ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న హిట్‌మ్యాన్ తాజాగా ఐదు వరుస ఇన్నింగ్స్ లలో సింగిల్ డిజిట్‌కే పరిమితమై మరో పేలవ రికార్డును నమోదుచేశాడు. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రోహిత్.. తన 16 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో వరుసగా ఐదు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే నిష్క్రమించడం ఇదే ప్రథమం.
గత ఐదు మ్యాచ్‌లలో రోహిత్ స్కోర్లు : 2 (8 బంతుల్లో), 3 (5), 0 (3), 0 (3), 7 (8).
- 2017 సీజన్‌లో రోహిత్ వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో 3, 2, 4, 0 తర్వాత ఇంత చెత్తగా ఆడటం ఇదే ప్రథమం.
ఐపీఎల్ -16 సీజన్ ఆరంభంలో హిట్‌మ్యాన్ ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీతో ఆడిన మ్యాచ్ లో 45 బంతుల్లోనే 65 పరుగులు చేసి ఫామ్ లోకి వచ్చినట్టే కనిపించాడు. ఆ తర్వాత మరీ గొప్పగా ఆడకపోయినా ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. కానీ గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ నుంచి మాత్రం క్రీజులో నిలబడటానికే తంటాలు పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
అయితే రోహిత్ విఫలమైనా ముంబై వరుసగా గత మూడు మ్యాచ్‌లలో ఛేదనకు దిగి 200 ప్లస్ టార్గెట్‌ను ఉదేసింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, నెహల్ వధేరాలు ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
మంగళవారం వాంఖెడే వేదికగా ఆర్సీబీతో ముగిసిన హై స్కోరింగ్ గేమ్ లో కూడా సూర్య రెచ్చిపోయి ఆడటంతో ముంబై ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై.. 16,3 ఓవర్లలోనే ఛే‘దంచేసింది’. ఈ సీజన్ లో 200, అంతకుమించి టార్గెట్‌ను ఛేదించడం ముంబైకి ఇది మూడోసారి కావడం గమనార్హం. భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆటగాడు, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 83, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) కు తోడుగా నెహల్ వధేర (34 బంతుల్లో 52 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఆర్సీబీ లక్ష్యం చిన్నబోయింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.