IPL 2023: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశ ముగిసింది. కప్పు వేటలో ఇంకా మిగిలింది మూడు మ్యాచులే. రెండు సెమీఫైనల్స్, ఓ ఫైనల్. ఈ ప్రపంచకప్ అభిమానులను అలరించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. చిన్న జట్లు పెద్ద జట్లకు షాకులిచ్చాయి. పెను సంచలనాయి నమోదయ్యాయి. ఈ సంచలనాల్లో చిన్న జట్లలోని కొంతమంది ఆటగాళ్లు కీలకపాత్ర పోషించారు. నిలకడగా సత్తా చాటి తమ జట్టు విజయాల్లో భాగమయ్యారు. ఇప్పుడు వారిపై ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. 



మరికొన్ని నెలల్లో జరగబోయే భారత టీ20 లీగ్ ఐపీఎల్ కోసం ఇంకొన్ని రోజుల్లోనే వేలం జరగనుంది. దానికన్నా ముందు నవంబర్ 15లోగా రిటైన్ చేసుకోబోతున్న ఆటగాళ్ల లిస్ట్ ను ఆయా ఫ్రాంచైజీలు బీసీసీఐకి అందించాలి. ఆ తర్వాత జరిగే వేలంలో ఎవరిని కొనుగోలు చేయాలి. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి లాంటి విషయాల్లో ఫ్రాంచైజీలు మునిగిపోతాయి. అగ్రశ్రేణి జట్ల ఆటగాళ్లందరూ దాదాపుగా ఐపీఎల్ కాంట్రాక్టులు ఉన్నవారే. కాబట్టి టీ20 మెగాటోర్నీలో రాణించిన చిన్న జట్ల ప్లేయర్స్ మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది. మరి పొట్టి కప్పులో రాణించి ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు ఆప్షన్స్ గా మారిన ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.


1. సికందర్ రజా


ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు సికందర్ రజా మొదటి ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. టీ20 ప్రపంచకప్ లో అంతలా రాణించాడీ జింబాబ్వే ఆల్ రౌండర్. పొట్టి కప్పులో రౌండ్- 1, సూపర్- 12 దశల్లో 148 స్ట్రైక్ రేటుతో 219 పరుగులు చేశాడు. 10 వికెట్లు తీశాడు. టీ20 ల్లో ఆల్ రౌండర్ల ప్రాముఖ్యత ఎలాంటిదో మనకు తెలిసిందే. కాబట్టి నాణ్యమైన ఆల్ రౌండర్ అయిన రజా కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడతాయి.  


2. బ్లెసింగ్ ముజరబానీ


జింబాబ్వేకే చెందిన పేస్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ. 8 మ్యాచుల్లో 8 కన్నా తక్కువ ఎకానమీతో 12 వికెట్లు తీశాడు. ఇతని బౌలింగ్ లో వేగంతోపాటు మంచి పేస్ ఉంటుంది. పవర్ ప్లే, ఆఖరి ఓవర్లలో సమర్ధవంతంగా బౌలింగ్ చేయగలడు. కాబట్టి ఇతనిపై ఫ్రాంచైజీలు దృష్టి పెట్టే అవకాశం ఉంది.


3. హ్యారీ టెక్టర్


ఐర్లాండ్ కు చెందిన ఈ యువ బ్యాటర్ ఈ టీ20 ప్రపంచకప్ లో ఓ మోస్తరు ప్రదర్శనే చేశాడు. అయితే అంతకుముందు అంతర్జాతీయ మ్యాచుల్లో బాగా రాణించాడు. కాబట్టి ఆ రికార్డులను దృష్టిలో పెట్టుకుంటే ఐపీఎల్ వేలంలో మంచి ధర దక్కే అవకాశం లేకపోలేదు. 


4. లోర్కాన్ టకర్


మరో ఐర్లాండ్ బ్యాటర్ అయిన లోర్కాన్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. పొట్టి ప్రపంచకప్ లో 7 మ్యాచుల్లో 204 పరుగులు చేశాడు. 41 యావరేజ్ తో చేసిన ఈ పరుగులను మంచి ప్రదర్శనగానే చెప్పుకోవచ్చు. వికెట్ కీపర్ కూడా కాబట్టి బ్యాకప్ కోసం అయినా ఫ్రాంచైజీలు ఇతనిని కొనుగోలు చేయవచ్చు. 


5. తస్కిన్ అహ్మద్


బంగ్లాదేశ్ పేసర్ అయిన తస్కిన్ అహ్మద్ పేరు కొన్నాళ్ల క్రితమే సుపరిచితం. భారత్ తో జరిగిన ఓ మ్యాచులో 5 వికెట్ల ప్రదర్శన చేయటంతో అతని పేరు బాగా వినపడింది. అయితే తర్వాత ఫామ్ లేమి, గాయాల కారణంగా వికెట్ల వేటలో వెనుకబడ్డాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు. మొదటి 3 మ్యాచుల్లోనే 8 వికెట్లు తీశాడు. టీమిండియాతో జరిగిన మ్యాచులో వికెట్ తీయలేకపోయినా.. 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ నిబంధనలు ఉండే పవర్ ప్లేలో కచ్చితత్వంతో బౌలింగ్ చేయగలడు తస్కిన్. కాబట్టి ఐపీఎల్ వేలంలో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. 


6. మ్యాక్స్ ఓ డౌడ్


నెదర్లాండ్స్ జట్టులో నిలకడగా పరుగులు చేసి మ్యాక్స్ ఓ డౌడ్ ఆకట్టుకున్నాడు. ఓపెనర్ అయిన డౌడ్ ఈ ప్రపంచకప్ లో 8 మ్యాచుల్లో 242 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 113. కాస్త తక్కువే అయినప్పటికీ నిలకడగా ఆడడం అతని బలం. కాబట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీలు బ్యాకప్ ఆటగాడిగా అయిన డౌడ్ వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. 


ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకునే అవకాశమున్న చిన్న జట్ల ఆటగాళ్లు వీరు. పెద్ద జట్లలోనూ ఇద్దరు యువ ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకర్షించవచ్చు. వారే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్, ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్. ఈ ప్రపంచకప్ లో అంతగా ప్రభావం చూపనప్పటికీ ఏ జట్టైనా తమ టీ20 టీంలో  ఉండాలని కోరుకునే ఆటగాళ్లు వీరిద్దరూ. కాబట్టి ఐపీఎల్ వేలంలో వీరికి చోటు దక్కవచ్చు. 


ఫైనల్ గా మనం ఎన్ని చెప్పుకున్నా ఆఖరికి ఆటగాళ్లను ఎన్నుకునే హక్కు ఐపీఎల్ ఫ్రాంచైజీలదే. ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొంటాయి. విదేశీ ఆటగాళ్ల కోటా, జట్టు కూర్పు, జట్టు అవసరాలకు తగ్గట్లు ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి మనం అంచనాలు వేసిన ఆటగాళ్లు వేలంలో అమ్ముడవుతారా లేదా అనేది ఆ సమయంలో తెలుస్తుంది.