Suryakumar Yadav brand valuation: ఐసీసీ టీ20 వరల్డ్‌  కప్‌ 2022లో మెరుపులు మెరిపిస్తున్నాడు సూర్యకుమార్‌ యాదవ్‌! బంతి ఎక్కడ పడనీ కొట్టేది మాత్రం బౌండరీకే అన్నట్టుగా అతడు చెలరేగుతున్నాడు. నిలబడ్డాడంటే కనీసం అర్ధశతకం బాదేస్తున్నాడు. అదీ మామూలుగా కాదు! కనీసం 175 లేదంటే 250 స్ట్రైక్‌రేట్‌ మెయింటేన్‌ చేస్తున్నాడు. దాంతో స్పాన్పర్లు, ప్రకటనదారులు అతడి వెంట పడుతున్నారని తెలిసింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింత చెల్లించేందుకు వారు సిద్ధపడుతున్నారట.


పాండ్యతో పోటీ!


ప్రస్తుతం భారత క్రికెట్లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య బ్రాండ్‌ విలువ చాలా ఎక్కువ! మిగతా ముగ్గురితో పోలిస్తే కింగ్‌ కోహ్లీ అందనంత ఎత్తులో ఉంటాడు. ఇప్పుడు మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ వారి జాబితాలో చేరుతున్నాడు. ప్రకటనలు చేసేందుకు ఒక రోజుకు రూ.1.5-2 కోట్ల మేర వసూలు చేయబోతున్నాడని తెలిసింది. ఒకప్పుడు అతడి బ్రాండ్‌ వాల్యూ కోటి రూపాయల మేర ఉండేది. ఇప్పుడు హార్దిక్‌ పాండ్యతో సమానంగా ఎదిగాడు.




విధ్వంసమే బలం


టీ20 క్రికెట్లో ఈ ఏడాది సూర్యకుమార్‌ విధ్వంసకరంగా ఆడుతున్నాడు. ఒక ఏడాదిలో 1000 పరుగులు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో రెండోవాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంటోంది. అందుకే అతడి ఎండార్స్‌మెంట్‌ ఫీజు రాహుల్‌, హార్దిక్‌ స్థాయికి పెరుగుతుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది అతడు అర్బన్‌ గాబ్రు, పింటోలా, బౌల్ట్‌ ఆడియోతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతి త్వరలోనే పెద్ద బ్రాండ్లు అతడి ఖాతాలో చేరబోతున్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ ఉండటం, అంతకన్నా ముందే ఐపీఎల్‌ ఉండటం ఇందుకు దోహదం చేస్తోంది.


ఆకర్ష.. ఆకర్ష..


'బ్రాండ్లు నిలకడ కోరుకుంటాయి. ఏడాది కాలంగా సూర్య అది చూపిస్తున్నాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో మేజర్‌ బ్రాండ్లేమీ లేవు. వచ్చే ఏడాది కొన్ని పెద్ద బ్రాండ్లు అతడితో ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తాం' అని ఫాస్ట్‌ అప్‌ సీఈవో విజయ రాఘవన్ వేణుగోపాల్‌ అన్నారు. జింబాబ్వేపై డిస్ట్రక్టివ్‌ ఇన్నింగ్స్‌ తర్వాత సూర్య చాలా బ్రాండ్ల దృష్టిని ఆకర్షించాడు. టీ20 ప్రపంచకప్‌ ముగిశాక అతడి కోసం క్యూ పెరగనుంది.


అప్పట్లో ధోనీ!


'విరాట్‌ కోహ్లీ, ఎంఎస్‌ ధోనీ, శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో మనం ఇదే చూశాం. మీడియా ఇంట్రెస్ట్‌, అతడి ట్రైనింగ్‌ రెజిమ్‌ను సూర్య సమతూకం చేసుకోవాల్సి ఉంటుంది. టెస్టు, వన్డే, టీ20 అన్ని ఫార్మాట్లలో నిలకడ చూపిస్తే బ్రాండ్లు ఏడాది నుంచి రెండేళ్లకు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఇప్పటికైతే టీ20, వన్డేల్లో సూర్య అద్భుతంగా ఆడుతున్నాడు. టెస్టుల్లోనూ రాణిస్తే తిరుగుండదు. ఒకప్పుడు ఎంఎస్‌ ధోనీ కెరీర్లో ఇదే చూశాం' అని వేణుగోపాల్‌ అంటున్నారు.